Union Budget 2025 లో బంపరాఫర్.. AI సెంటర్లకు భారీగా నిధులు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు ఇకపై చౌక!
ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ (Union Budget 2025) ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వైద్య విద్య, టెక్నాలజీ రంగాలకు భారీ ఊపునిచ్చేలా వరాల జల్లు కురిపించారు. AI చదువులకు కొత్త సెంటర్లు, మెడికల్ సీట్లు వేలల్లో పెంపు, దేశీయంగా తయారీకి ప్రోత్సాహం, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు మరింత చౌకగా మారేలా అదిరిపోయే ప్రకటనలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* AI చదువుల కోసం కొత్తగా సెంటర్లు, కోట్లు ఖర్చు..
AI టెక్నాలజీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచాన్ని మార్చే శక్తి దీనిలోనే కనిపిస్తోంది. అందుకే సీతారామన్ AI చదువుల కోసం ఏకంగా రూ.500 కోట్లు కేటాయించారు. ఈ డబ్బుతో AIలో నైపుణ్యం పెంచే సెంటర్లను పెడతారు. ఒక్కో సెంటర్‌కు రూ.100 కోట్ల చొప్పున ఇస్తారు.

ఇదివరకు 2023లో వ్యవసాయం, ఆరోగ్యం, నగరాల కోసం AI సెంటర్లు నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు చదువుల కోసం కూడా కొత్తగా సెంటర్లు వస్తున్నాయి. అంటే AI రంగంలో మన దేశం చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మన భారతీయ విద్యార్థులు చాలా ప్రయోజనాలు పొందుతారు.
* AI వస్తే ఉద్యోగాలు పోతాయా..
బడ్జెట్‌కు ముందు విడుదల చేసిన ఆర్థిక సర్వే 2024-25లో AI వల్ల ఉద్యోగాలపై పడే ప్రభావం గురించి చెప్పారు. తక్కువ నైపుణ్యం ఉన్న, తక్కువ విలువైన ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఉద్యోగాలు పోకుండా, AI సహాయంతో పనిచేసేలా మధ్యస్థాయి, ఉన్నత స్థాయి నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు.
AI ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉన్నా, మన దేశంలో జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ కాబట్టి ఎక్కువ ప్రభావం ఉంటుందని సర్వేలో తేల్చారు. కాబట్టి AI ఆఫర్ చేయలేని స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దానికి అనుకూలంగా నేటి తరం యువత సిద్ధం కావాలి.
* దేశీయంగా తయారీకి ఫుల్ సపోర్ట్..
దేశంలోనే వస్తువులు తయారుచేసే కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇండస్ట్రీ 4.0 కింద అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరం. అందుకే నైపుణ్యాల కోసం 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తారు. అవి కూడా ప్రపంచంలోని టాప్ సంస్థలతో కలిసి పనిచేస్తాయి.
ఈ సెంటర్లు ఏం చేస్తాయంటే.. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు డిజైన్ చేస్తాయి, ట్రైనర్లకు శిక్షణ ఇస్తాయి, నైపుణ్యాలకు సర్టిఫికెట్లు ఇస్తాయి, పరీక్షలు పెట్టి స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూస్తాయి. "మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్" ప్రోగ్రామ్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది.
* స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు ఇకపై చౌకగా
స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ LED టీవీల ధరలు తగ్గబోతున్నాయి. వాటిల్లో వాడే కొన్ని ముఖ్యమైన భాగాలపై దిగుమతి సుంకం తగ్గించారు. దీనివల్ల ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి, మన దేశంలోనే తయారీ పెరుగుతుంది, ఎలక్ట్రానిక్స్ తయారీలో మన దేశం ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌కు వెళ్తుంది.
* ఇంకా ఏమేం మార్పులు చేశారు..
మొబైల్ బ్యాటరీలు తయారు చేయడానికి కావాల్సిన 28 రకాల వస్తువులను కొత్తగా చేర్చారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలపై కస్టమ్స్ డ్యూటీ 10% నుంచి 20% కి పెంచారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద దేశంలోని ప్రభుత్వ స్కూళ్లన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఇస్తారు. దీంతో విద్యార్థులకు డిజిటల్ విద్య అందుబాటులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications