ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌పై టెక్సాస్‌లో కేసు

Posted By: Prashanth

ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌పై టెక్సాస్‌లో కేసు

 

బెంగళూరు: తక్కువ కాలం యుఎస్‌ బిజినెస్‌ వీసాల స్పాన్సర్‌షిప్‌ విషయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ, ఇండియాలోని రెండవ అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్‌పై టెక్నాస్‌లో కేసు నమోదైంది. టెక్సాస్‌లో సంస్థ నిర్వహిస్తున్న కార్యాలయంపై విచారణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ నిర్థారిస్తూ, గత సంవత్సరం మేలో టెక్సాస్‌ తూర్పు జిల్లాకు చెందిన యుఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు నుంచి తమకు సమన్లు అందాయని తెలిపింది. బి1 వీసాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, డాక్యుమెంట్లను అందించాలని కోరారని, వాటన్నింటినీ అధికారులకు ఇచ్చామని యుఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు ఇన్ఫోసిస్‌ తెలిపింది.

ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు లక్ష్యంగా విచారణ ప్రారంభమైనట్టు తెలిపింది. కాగా, బి1 వీసాలను వినియోగించుకుని భారత్‌లోని సంస్థ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని వ్యాపార అవసరాల కోసం కొంత కాలం పాటు యుఎస్‌కు పంపే వీలుంటుంది. ఈ తరహా వీసాలపై వెళ్లిన వారు అక్కడే తిష్ట వేసినట్టు యుఎస్‌ అధికారుల ప్రాధమిక విచారణలో వెల్లడైనట్టు సమాచారం. అయితే, తాము ఎటువంటి దుర్వినియోగానికి పాల్పడలేదని, విచారణ సంఘాలకు పూర్తిగా సహకరిస్తున్నామని ఇన్ఫోసిస్‌ ప్రతినిధి సారా వనితా గిడియన్‌ వివరించారు.

ఇన్ఫోసిస్‌ ఎన్ని బి1 వీసాలకు దరఖాస్తు చేసింది, ఎన్ని వీసాలు వచ్చిందన్న విషయం ఇప్పటికిప్పుడు వెల్లడించలేనని ఆమె అన్నారు. కాగా, అలబామాలోని ఇన్ఫోసిస్‌ కేంద్రం ఇదే తరహా కేసు యుఎస్‌ ఫెడరల్‌ కోర్టులో ఆగస్టు 20న విచారణకు రానున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇన్ఫోసిస్‌కి యుఎస్‌ కేంద్రంగా పనిచేస్తున్న కన్సల్టెంట్‌ జాక్‌ పామర్‌ వీసా మోసాలకు పాల్పడ్డాడన్నది అభియోగం మోపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot