ఐటిపై అమెరికా రేటింగ్ తగ్దింపు ప్రభావం

Posted By: Super

ఐటిపై అమెరికా రేటింగ్ తగ్దింపు ప్రభావం

అమెరికా పరపతి రేటింగ్‌ను స్టాండర్డ్‌ &పూర్స్‌ (ఎస్‌ & పీ) తగ్గించడం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో ప్రకంపనలకు దారి తీసింది. సోమవారం భారత మార్కెట్‌ పతనానికి అతిగా స్పందించడమే కారణమని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక పరిస్థితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుతో పాటు భారత వృద్ధిరేటుపై తమ అభిప్రాయాలను తెలిపారు. అమెరికాలో 'లేమన్‌ సంక్షోభం' మళ్లీ పునరావృతం కాదన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు.

అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితులు భారత ఐటీ కంపెనీలపై స్వల్పకాలంలో ప్రభావం చూపలేవని ఐటీ పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే భవిష్యత్‌ అంచనాలపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. 'ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించేదేనైనా సమీప భవిష్యత్‌లో ఐటీ కంపెనీలపై పెద్ద ప్రభావం ఉండద'ని నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌ సోమ్‌ మిట్టల్‌ సోమవారమిక్కడ విలేకర్లతో తెలిపారు. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఉత్తర అమెరికా, ఐరోపాల్లో వ్యాపార డిమాండులో మార్పులు తీసుకురాజాలవని ఆయన అన్నారు.

భారత ఐటీ పరిశ్రమ మొత్తం ఆదాయాల్లో 60 శాతం ఉత్తర అమెరికా నుంచి పొందుతున్నవే. మరో పక్క 'ప్రస్తుత ఊగిసలాట వాతావరణంలో మా కస్టమర్ల వ్యాపార పథకాల అమలులో మేం సహకరిస్తామ'ని టీసీఎస్‌ ఎండీ, సీఈఓ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. విప్రో సీఈఓ(ఐటీ వ్యాపారం), డైరెక్టర్‌ టి.కె. కురియన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా, ఇతర మార్కెట్లలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మరింత సమయం వేచిచూడడం మంచిదని ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ క్రిస్‌ గోపాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.

ఇది ఇలా ఉంటే ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్దిక మాంద్య సవాళ్లను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని అన్నారు. అమెరికా, యూరప్‌లోని పరిణామాల ప్రభావం భారత్‌పై కొంత మేరకు ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఎఫ్‌ఐఐల పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయ గమ్యస్థానం కాగలదు. అధిక ప్రతిఫలాలు లభిస్తున్నందున 2008 తర్వాతి పరిస్థితుల కన్నా ఇప్పుడు ఎఫ్‌ఐఐల పెట్టుబడులు బాగా పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థ మూలాల్లో మార్పులేదు. చాలా పటిష్టంగా ఉన్నాయి. తగ్గిన కమోడిటీ ధరలు ద్రవ్యోల్బణం తగ్గడానికి దోహదం చేస్తాయి. అంతర్జాతీయ సవాళ్లను నెగ్గుకు రావడంలో అనేక దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థితిలో ఉంది.

ఆర్దిక ముఖ్య సలహాదారు కౌశిక్‌ బసు మాట్లాడుతూ అమెరికా రేటింగ్‌ తగ్గింపునకు స్పందనగానే భారత మార్కెట్‌ క్షీణించింది. మళ్లీ కోలుకుంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిదానంగా కోలుకోవడం భారత ఎగుమతులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ప్రభావం చూపుతుంది. అమెరికా ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేయగలదని భావించలేం అని అన్నారు.

రంగరాజన్‌, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ మాట్లాడుతూ దీనిపై ఇండియన్స్ ఆందోళన చెందనక్కర్లేదు. అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడాన్ని తేలిగ్గా తీసుకోలేం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. అమెరికా ఆర్థిక వ్యస్థ నిదానంగా వృద్ధి చెందుతుంది. అవసరమైతే ప్రభుత్వం, ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మన ఎగుమతులపై ప్రభావం ఉంటుంది. సోమవారం ప్రారంభంలో మార్కెట్‌ పతనం తెలియని భయంతో వచ్చిన స్పందనే. మదుపర్లు అతిగా స్పందించారని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot