జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్.. వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంత?
నెట్టింట తరచూ ఎన్నో వింత పుకార్లు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం 2025, జనవరి 16న అంటే నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోతుందనే ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. "ఇంటర్నెట్ బ్లాకౌట్ డే" అని, దానికితోడు సింప్సన్స్ కార్టూన్ కూడా ఈ విషయాన్ని ముందే చెప్పిందని చాలామంది నమ్మేస్తున్నారు.
ఇండియాలో కూడా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని రకరకాల పోస్టులు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు, ఇది పక్కా ఫేక్ న్యూస్.

* అసలు ఈ పుకారుకు కారణం ఏంటంటే...
కొద్ది రోజులుగా కొందరు డొనాల్డ్ ట్రంప్ జనవరి 16న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి, అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారం జనవరి 20న జరుగుతుంది. ఈ తప్పుడు సమాచారంతోపాటు, ఇంటర్నెట్ షట్‌డౌన్ గురించి పుకార్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి.
ట్రంప్ అలా ప్రమాణస్వీకారం చేయడం, ఇలా ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్లిపోవడం ఒకేసారి జరుగుతాయి అన్నట్లు వీరు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే, ఈ పుకార్లకు ఎలాంటి ఆధారాలు లేవు.
* సోషల్ మీడియాలో వైరల్
ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో సింప్సన్స్ కార్టూన్‌లో సముద్రపు సొరచేపలు సముద్రగర్భంలోని ఇంటర్నెట్ కేబుల్స్‌ను కొరికేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోతుందని చూపించారు.
అమెరికాలో ఫోన్లు పనిచేయవని, పేమెంట్లు చేయలేరని, ఆఖరికి ఆపిల్ స్టోర్లలో కూడా పని జరగదని ఆ వీడియోలో ఉంది. ఐతే హోమ్ వర్క్ చేయనక్కర్లేదు కాబట్టి బార్ట్ సింప్సన్ మాత్రం హ్యాపీగా ఉంటాడని ఫన్నీగా చూపించారు.
* ఫేక్..
అయితే ఇది పూర్తిగా ఫేక్ వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఉపయోగించి ఎవరో దీన్ని క్రియేట్ చేశారు. నిజానికి సింప్సన్స్ కార్టూన్‌లో అలాంటి ఎపిసోడ్ ఏదీ లేదు. సింప్సన్స్ కొన్ని నిజమైన సంఘటనలను ముందుగానే ఊహించిందని అంటుంటారు కానీ, ఈ ఇంటర్నెట్ బ్లాకౌట్ వార్త మాత్రం అబద్ధం.
నిజ జీవితంలో అప్పుడప్పుడు సొరచేపలు లేదా ఇతర సముద్ర జీవులు సముద్రగర్భంలోని ఇంటర్నెట్ కేబుల్స్‌ను డ్యామేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోదు. ఇప్పుడు ఆ కేబుల్స్‌ను కెవ్లార్ లాంటి బలమైన మెటీరియల్స్‌తో తయారు చేస్తున్నారు. కాబట్టి అంత పెద్ద డ్యామేజ్ జరగడం చాలా కష్టం.
ఈ వార్తలపై సోషల్ మీడియాలో చాలామంది నవ్వుకున్నారు. ఒకవేళ నిజంగా ఇంటర్నెట్ ఆగిపోతే పనికి సెలవు పెట్టేస్తామని జోకులు పేల్చారు. ఈ పుకార్లను నమ్మేవారికి టెక్నాలజీ గురించి ఏమీ తెలియదని కొందరు కామెంట్ చేశారు.
* నిజమేంటి
2025, జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోలు, పోస్టులు అన్నీ నిరాధారమైనవి. ఏదైనా సమాచారం షేర్ చేసే ముందు కచ్చితంగా దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకూడదు.
మరోవైపు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అధికారుల్లాగా మోసగాళ్లు ఫోన్లు చేసి ఫేక్ వార్నింగ్స్‌తో మిమ్మల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం నమ్మదగిన సోర్సులపై ఆధారపడాలి.


Click it and Unblock the Notifications








