వీఎంసీ చౌక టాబ్లెట్ పీసీలు.. డేటావిండ్‌తో ఒప్పందం!

హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన టెలికం, విద్యుత్ పరికరాల తయారీ సంస్థ వీఎంసీ సిస్టమ్స్ .. చౌక ట్యాబ్లెట్ పీసీలైన యూబీస్లేట్ తయారీ కోసం డేటావిండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆగస్టు నాటికి 1,00,000 యూబీస్లేట్స్‌ను వీఎంసీ అందించాల్సి ఉంటుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని కంపెనీ ఈడీ బి. వెంకటరమణ గురువారం తెలిపారు. ఇప్పటికే 10,000 పైగా యూబీస్లేట్స్‌ను అందించినట్లు ఆయన వివరించారు.
ప్రస్తుతం రోజుకి 500 మేర ఉత్పత్తి చేస్తున్నామని, వచ్చే నెల ఈ సంఖ్యను 4,000లకు పైగా పెంచుతామని వీఎంసీ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్ విభాగం) మూర్తి సురవరపు పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి పది లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు హైదరాబాద్ శివారు మహేశ్వరంలో ఉన్న ప్లాంటులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.
చౌక ఆకాశ్2 ట్యాబ్లెట్ పీసీల కోవకే చెందినవే అయినప్పటికీ యూబీస్లేట్ వేరని తెలిపారు. ప్రస్తుతం డేటావిండ్ కోసం తమ కంపెనీ మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెంకటరమణ పేర్కొన్నారు. తాము కేవలం తయారు చేసి ఇస్తామని .. ప్రొడక్టు డిజైను, మార్కెటింగ్, అమ్మకాలు మొదలైనవన్నీ డేటావిండ్ చూసుకుంటుందన్నారు. ప్రస్తుతం విడిభాగాలను దిగుమతి చేసుకుని, ఇక్కడ అమరుస్తున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications