వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో రెండు నగరాల్లో 5G నెట్‌వర్క్ ప్రారంభం..!
భారత్‌లో ప్రస్తుతం అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. ఈ రేస్‌లో జియో, ఎయిర్‌టెల్ ముందున్నాయి. వోడాఫోన్ ఐడియా కాస్త వెనుకబడి ఉంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రం ప్రస్తుతం 4G ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. మే- జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4G ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే వోడాఫోన్ ఐడియా ఇటీవలే ముంబయిలో 5G నెట్‌వర్క్‌ను (Vodafone idea 5G) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముంబైతోపాటే ఈ స్టేడియంలలో 5G నెట్‌వర్క్ :
ముంబైతోపాటు దేశంలోని ప్రధాన 11 స్టేడియంలలో 5G సేవలను Vi ప్రారంభించింది. ఇందులో చెన్నైలోని చిదంబరం స్డేడియం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, విశాఖపట్నంలోని డా.వైఎస్‌ఆర్ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఉన్నాయి.

వీటితోపాటు హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం, అహ్మదాబాద్‌లోని నమో స్టేడియం, జైపూర్ మాన్సింగ్ స్టేడియం, లక్నో, చంఢీగడ్‌లోని స్టేడియంలలోనూ 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలకు 5G నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని పేర్కొంది.
త్వరలో ఎక్కడ ప్రారంభం కానుంది ? :
ఇందులో భాగంగా తాజాగా బిహార్‌లోని పాట్నా, పంజాబ్‌లోని చంఢీగడ్‌లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోనూ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రూ.299 రీఛార్జ్ పైన :
ముంబైలో రూ.299 అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌లు కలిగిన యూజర్లకు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. అయితే మిగిలిన నగరాల్లో ఈ రీఛార్జ్ ప్లాన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలోనే ఈ ప్లాన్‌లపై Vi స్పందించింది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే వోడాఫోన్ ఐడియా ధరలు తక్కువకే అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
మూడు సంవత్సరాల్లో 100 నగరాల్లో :
తాజాగా అందుబాటులోకి వచ్చిన పాట్నా, చంఢీగడ్‌తోపాటు ముంబైలో వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులు ప్రారంభం అయ్యాయి. రానున్న మూడు సంవత్సరాల కాలంలో 17 టెలికాం సర్కిల్స్‌లోని 100 నగరాల్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని VI తెలిపింది.
వివిధ ఆర్థిక కారణాలతో Vi 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం జియో. ఎయిర్‌టెల్ 95 శాతం జిల్లాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. గత నెలలో పార్లమెంట్‌లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 776 జిల్లాలకు గాను 773 జిల్లాల్లో 5G నెట్‌వర్క్ ప్రారంభం అయిందని, మిగిలిన ప్రాంతాలకు 5G నెట్‌వర్క్ విస్తరణ కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుతం రూ.299 రీఛార్జ్ ప్లాన్ నుంచే Vi అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1GB 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








