ఇంటర్నెట్‌లో మనం రాసే రాతలు కాసులు కురిపించాలంటే ఏం చేయాలి

Posted By: Super

ఇంటర్నెట్‌లో మనం రాసే రాతలు కాసులు కురిపించాలంటే ఏం చేయాలి

చక్కగా రాయగలిగే నైపుణ్యం ఉంటే ఇంటర్నెట్‌ ద్వారా ఎంతో కొంత ఆదాయం సంపాదించే వీలుంది. అలాగని చెయ్యి తిరిగిన రచయితలో, కవులో కానక్కర్లేదు. పొందికైన వాక్యాల్లో, స్పష్టమైన భావవ్యక్తీకరణ చేయగలిగితే చాలు. వెబ్‌సైటు, బ్లాగుల నిర్వహణ ద్వారానే కాదు ఓ విశ్లేషణ, ఓ అభిప్రాయం, ఓ సినిమా రివ్యూ, ఓ ఆశ్చర్యకరమైన విశేషం, ఓ సూచనాత్మక వ్యాసం ఇలా రకరకాల రచనలను స్వీకరించి అంతో ఇంతో ముట్టచెప్పే సైట్లు ఎన్నో ఉన్నాయి. నెట్‌ ద్వారా ఆదాయం సంపాదించాలనుకుంటే ఆన్‌లైన్‌ అకౌంట్‌ కలిగి ఉండడం తప్పనిసరి. వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ కాకుండా కేవలం ఇందుకోసమే ఉపయోగపడే 'పేపాల్‌'లాంటి వాటిలో సభ్యులవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 944 లక్షల మంది పేపాల్‌ ఎకౌంట్‌ను వాడుతున్నారు. పేపాల్‌తో పాటు మరికొన్ని అకౌంట్స్‌ కూడా ఉన్నాయి.

పేపాల్‌ ఎకౌంట్‌లో సభ్యత్వం ఎలా

సైట్‌లోకి (www.paypal.com) వెళ్లి 'సైన్‌అప్‌'పై క్లిక్‌ చేస్తే పర్సనల్‌, ప్రీమియర్‌, బిజినెస్‌ అనే మూడు విభాగాలు కనిపిస్తాయి. మీ అవసరానికి తగ్గట్టు ఒకటి ఎంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేయడానికి ప్రీమియర్‌, బిజినెస్‌లు అవసరమవుతాయి. పర్సనల్‌ అకౌంట్‌ ఉచితమైనా మిగతా రెండింటికీ కొంత ఛార్జ్‌ చేస్తారు. అకౌంట్‌కి ఎనిమిది కంటే ఎక్కువ క్యారెక్టర్స్‌ ఉండేలా క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని తయారు చేయండి. రెండు వారాలకోసారి పాస్‌వర్డ్‌ని మార్చేయండి. రిజిస్ట్రేషన్‌లో భాగంగా భారత ప్రభుత్వ రిజర్వు బ్యాంక్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం పాన్‌ నెంబర్‌, పుట్టిన రోజు వివరాలు నమోదు చేయాలి. వ్యక్తిగత వివరాలు ఎంటర్‌ చేసేప్పుడు సైట్‌ సురక్షితమో కాదో తెలుసుకోవాలి. అందుకు అడ్రస్‌బార్‌లో వెబ్‌సైట్‌ ప్రారంభానికి ముందు https:// ఉందో లేదో చూడండి.

అలాగే అడ్రస్‌ బార్‌ చివర్లో తాళం గుర్తు ఉండాలి. ఎకౌంట్‌ సెక్యూరిటీ కోసం మొబైల్‌ నెంబర్‌ని కూడా కోరతారు. చివరిగా క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ చేయాలి. తర్వాత మీ క్రెడిట్‌ కార్డ్‌ స్టేట్‌మెంట్‌ కోసం వేచి చూడాలి. స్టేట్‌మెంట్‌లో 4 లేదా 5 అంకెల డిపాజిట్‌ కోడ్‌తో పే పాల్‌ అకౌంట్‌లో సుమారు 1.95 డాలర్ల ట్రాన్స్‌సాక్షన్‌ చేయమని వస్తుంది. అప్పుడు మీరు కోడ్‌ను ఎంటర్‌ చేసి 'వెరిఫై' ట్యాబ్‌ను క్లిక్‌ చేస్తే Verified Congratulations అని వస్తుంది. దీంతో మీ ఎకౌంట్‌ క్రియేట్‌ అయినట్టే! ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ప్రత్యేకంగా మరో క్రెడిట్‌ కార్డ్‌ని తీసుకుని అదే కార్డ్‌ని పేపాల్‌ అకౌంట్‌లో వాడడం ద్వారా ఎప్పటికప్పుడు సులభంగా మానిటర్‌ చేయవచ్చు. దీంతో నిశ్చింతగా మీరు ఈ-ఎర్నింగ్‌లో పేపాల్‌ వాడుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot