వాట్సాప్ ద్వారా మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. అప్రమత్తంగా లేకుంటే...!
Whatsapp Traffic Challan Scam : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో సిమ్ కార్డులతో అధికారులు, పోలీసులు సహా ఇతర వ్యవస్థల పేరు చెప్పి, ఆందోళనకు గురిచేసి నగదు తమ ఖాతాలకు మళ్లించుకున్న ఘటనలు గతంలో అనేకం బయటకు వచ్చాయి. అయితే క్రమంగా సోషల్ మీడియా యాప్స్ ద్వారా యాడ్స్ ఇచ్చి, బోల్తా కొట్టించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్‌లో ఒకటైన వాట్సాప్ ద్వారా వివిధ రూపాల్లో మోసాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలో ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా వాట్సాప్‌లో APK ఫైల్స్ ద్వారా జరుగుతున్న మోసం బయటకొచ్చింది. ఓ వ్యక్తి వాట్సాప్ నంబర్‌కు తెలియని నంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆ నంబర్ RTO AIFMVD (ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్) లోగోను కలిగి ఉంది.
ఈ నంబర్‌తో TRAFFIC CHALLAN.apk ఫైల్ వచ్చింది. అయితే దానిపై క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ నుంచి వార్నింగ్ మెసేజ్ వచ్చింది. APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే.. ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దాని ఆధారంగా వచ్చిన మెసేజ్ చలాన్ కాదని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇలాంటి APK ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఏం ప్రమాదం జరుగుతుంది. యాప్స్‌ను ఎప్పుడు కూడా యాప్ స్టోర్స్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముఖ్యంగా APK ఫైల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పొరపాటున ఈ తరహా ఫైల్స్ ఇన్‌స్టాల్ చేస్తే.. వాటి ద్వారా మీ ఫోన్‌లోకి మాల్‌వేర్ ప్రవేశించే ప్రమాదం ఉంది.

ఫలితంగా మీ డేటాను ఆయా యాప్స్ చోరీ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు బ్యాంకులకు సంబంధించిన OTP లను కూడా చోరీ చేసి, మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉంది. మరియు వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉంది.
> ఎట్టి పరిస్థితుల్లోనూ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ ద్వారా మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
? సంస్థల అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
> ఇ-చలానా సహా ఇతర పేమెంట్స్‌ను అధికారిక యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలి.
> వాహనాలకు సంబంధించిన చలానాలను parivahan e-Challan వెబ్‌సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటికే మీకు APK ఫైల్ ను ఇన్‌స్టాల్ చేస్తే, వెంటనే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆఫ్ చేయాలి. అనంతరం వెంటనే ఆ ఫైల్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత యాంటీ వైరస్ ద్వారా స్కాన్ చేయాలి. మీ బ్యాంకులను కూడా వెంటనే తనిఖీ చేసుకోవాలి.
నగదు బదిలీ చేసినట్లు ఎటువంటి అనుమానం కలిగినా, సంబంధిత బ్యాంకులను సంప్రదించాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాట్సాప్ ద్వారా అనుమానాస్పద లింక్ వచ్చినప్పుడు, వాటిని ఓపెన్ చేయకుండా.. రిపోర్టు చేసి, బ్లాక్ చేయాలి.


Click it and Unblock the Notifications








