వాట్సాప్‌లో ఓ ఫోటో డౌన్‌లోడ్ చేశాడు.. క్షణాల్లో రూ.2 లక్షలు మాయం.. మీకూ ఇలా జరగొచ్చు!
WhatsApp Image Scam : మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల యువకుడు, వాట్సాప్‌లో వచ్చిన ఒక ఫోటోను డౌన్‌లోడ్ చేసిన పాపానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఏకంగా రూ.2 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. చూడ్డానికి చాలా మామూలుగా కనిపించే ఫోటో వెనుక ఇంత పెద్ద మోసం దాగి ఉంటుందని ఎవరూ ఊహించలేరు. సైబర్ నేరగాళ్లు "స్టెగానోగ్రఫీ" అనే కొత్త రకం హ్యాకింగ్ టెక్నిక్‌తో ఈ దారుణానికి పాల్పడ్డారు.
* మోసం జరిగిందిలా..
స్టెగానోగ్రఫీ అంటే, మామూలు ఫైల్స్‌లోనే ప్రమాదకరమైన కోడ్‌ను దాచిపెట్టి మోసం చేయడం అన్నమాట. బాధితుడి పేరు ప్రదీప్ జైన్. ఒక రోజు ఉదయాన్నే అతనికి తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కొద్దిసేపటికే, అదే నంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది.

అందులో ఒక వృద్ధుడి ఫోటోతో పాటు, "ఈ వ్యక్తి మీకు తెలుసా?" అని ఒక ప్రశ్న ఉంది. మొదట ప్రదీప్ ఆ మెసేజ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అదే నంబర్ నుంచి మళ్లీ మళ్లీ కాల్స్ రావడంతో, ఇక లాభం లేదనుకుని మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేశాడు.
దాంతో ఆ ఒక్క క్లిక్‌తో తన కెనరా బ్యాంక్ ఖాతా నుంచి రూ.2.01 లక్షలు హ్యాకర్ల పాలవుతాయని అతను కలలో కూడా ఊహించలేదు. ప్రదీప్ ఆ ఫోటోను ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే హ్యాకర్లు అతని బ్యాంకింగ్ వివరాలు మొత్తం చేజిక్కించుకున్నారు. వెంటనే, హైదరాబాద్‌లోని ఓ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేశారు.
* మిమిక్రీతో మోసం
అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం ఏంటంటే, ఈ లావాదేవీ జరిగినప్పుడు నిర్ధారణ కోసం బ్యాంక్ వాళ్లు ప్రదీప్‌కు ఫోన్ చేస్తే, హ్యాకర్లు ఏకంగా అతని గొంతును అనుకరించి (మిమిక్రీ చేసి) మాట్లాడారు. దీంతో, ఆ లావాదేవీకి ప్రదీప్ జైనే అనుమతి ఇచ్చాడని బ్యాంక్ వాళ్లు కూడా నమ్మేశారు.
* ఏంటీ స్టెగానోగ్రఫీ, ఇంత సైలెంట్‌గా ఎలా మోసం చేస్తారు?
నిపుణుల ప్రకారం, ఈ మోసంలో LSB (లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్) స్టెగానోగ్రఫీ అనే పద్ధతిని వాడారు. అంటే, ఫోటోలు, ఆడియో క్లిప్పులు, పీడీఎఫ్ ఫైల్స్ లాంటి మామూలుగా కనిపించే ఫైల్స్‌లోనే హానికరమైన కోడ్‌ను (మాల్‌వేర్‌ను) తెలివిగా దాచిపెడతారు. ఈ ఫైల్స్ చూడటానికి సాధారణంగానే ఉండటంతో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్లు కూడా వీటిని గుర్తించలేవు.
ఎప్పుడైతే యూజర్ ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తాడో, లోపల దాగి ఉన్న మాల్‌వేర్ సైలెంట్‌గా యాక్టివేట్ అయిపోతుంది. మనకు తెలియకుండానే మన ఫోన్‌లోని విలువైన సమాచారాన్ని దొంగిలిస్తుంది. బ్యాంక్ వివరాలు కూడా తస్కరిస్తుంది. ఇంకేముంది సైబర్ నేరగాళ్లకు డబ్బులు కాజేయడం సాధ్యమవుతుంది.
* మాల్‌వేర్ ఎలా పనిచేస్తుంది..
సైబర్ నిపుణుడు తుషార్ శర్మ దీని గురించి వివరిస్తూ, "ఫోటోల్లో రంగులకు సంబంధించిన డేటా ఉంటుంది కదా (ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల కోడ్స్). హ్యాకర్లు ఈ కలర్ కోడ్స్‌లోనే మాల్‌వేర్‌ను దాస్తారు. మనం ఫోటో ఓపెన్ చేయగానే, మనకు ఏమాత్రం అనుమానం రాకుండా ఆ మాల్‌వేర్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది.
* ఈ మోసాన్ని గుర్తించడం ఎందుకు కష్టం?
అలా ఇన్‌స్టాల్ అయిన మాల్‌వేర్ మన పర్సనల్ మెసేజ్‌లను చదవడం, బ్యాంకింగ్ యాప్స్‌ను యాక్సెస్ చేయడం, చివరికి మన ఫోన్‌నే తన కంట్రోల్‌లోకి తీసుకోవడం లాంటి పనులు చేస్తుంది" అని తెలిపారు. సాధారణంగా సైబర్ మోసాలంటే ఫేక్ వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింకులు పంపడం లాంటివి ఉంటాయి. కానీ ఈ స్టెగానోగ్రఫీ మోసంలో అలా కాదు.
మనం రోజూ వాడే .jpg, .png (ఫోటోలు), .mp3 (పాటలు), .mp4 (వీడియోలు), PDF ఫైల్స్ లాంటి వాటినే వాడతారు. వాట్సాప్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి ఫైల్స్‌ను మనం రోజూ షేర్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి, ఎవరికీ వీటిపై అంత త్వరగా అనుమానం రాదు. ఇదే హ్యాకర్లకు కలిసొచ్చే అంశం.
* మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వాట్సాప్‌లో మీడియా (ఫోటోలు, వీడియోలు) ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యే ఆప్షన్‌ను వెంటనే ఆఫ్ చేయండి. మీకు తెలియని, పరిచయం లేని నంబర్ల నుంచి ఏవైనా ఫైల్స్ వస్తే అస్సలు డౌన్‌లోడ్ చేయకండి. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీ OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్)లను ఇతరులతో పంచుకోవద్దు. ఎవరు పడితే వాళ్లు మిమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చకుండా సెట్టింగ్స్ మార్చుకోండి (Settings > Privacy > Groups). వాట్సాప్‌లో 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్' (Silence Unknown Callers) ఫీచర్‌ను ఆన్ చేసుకోండి.
* వాట్సాప్ స్పందన ఏంటి..
ఇలాంటి మోసాలు జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తెలియని నంబర్ల నుంచి మెసేజ్ పంపిన వారిని గుర్తించేందుకు "కాంటెక్స్ట్ కార్డ్స్" లాంటి ఫీచర్లను యాప్‌లో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
అనుమానాస్పదంగా అనిపించిన ఖాతాలను వెంటనే బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయాలని, అలాగే అపరిచితులు, నమ్మకం లేని వారి నుంచి వచ్చే ఎలాంటి మీడియా ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని యూజర్లకు గట్టిగా సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








