రతన్ టాటాకు వారసుడు దొరకలేదు.. ఎంపిక కమిటీ

Posted By: Staff

రతన్ టాటాకు వారసుడు దొరకలేదు.. ఎంపిక కమిటీ

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాకు వారసుడి అన్వేషణ ప్రయత్నాలు ఫలించలేదు. రతన్ స్థానంలో పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తిని అన్వేషించేందుకు నియమించిన ఎంపిక కమిటీ ఎనిమిది నెలల తర్వాత ఈ విషయంలో చేతుతెత్తేసింది. రతన్ వారసుడిని అన్వేషించలేమనే నిశ్చితాభిప్రాయానికి తాము వచ్చినట్లు కమిటీలో సభ్యుడైన టాటా సన్స్ డెరైక్టర్ ఆర్.కె.కృష్ణ కుమార్ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు.

టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్... గతేడాది ఆగస్టులో ఐదుగురు సభ్యులతో కూడిన ఎంపిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది డిసెంబర్‌లో 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న రతన్ టాటా రిటైర్‌కానుండడంతో ఆయన వారసుడి కోసం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కమిటీలో టాటా సన్స్ మాజీ వైస్ చైర్మన్ ఎన్‌ఏ సూనావాలా, గ్రూప్ డెరైక్టర్ సైరస్ మిస్ర్తీ, గ్రూప్ అడ్వయిజర్ అండ్ లాయర్ షిరీన్ బరూచా, ప్రముఖ బ్రిటిష్ వ్యాపారవేత్త లార్డ్ భట్టాచార్యలు కూడా సభ్యులుగా ఉన్నారు.

కాగా, రతన్ టాటాపై ప్రసంశల జల్లు కురిపించిన కుమార్... 71 బిలియన్ డాలర్ల టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడ్ని అన్వేషించేందుకు అనువుగా ఎంపిక కమిటీ తన ప్రమాణాలను తగ్గించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ‘రతన్ సహజసిద్ధమైన నాయకుడు. ఆయన ప్రతి అడుగులో ఈ విషయాన్ని చూడొచ్చు. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో ఆయనకు తప్పక స్థానం దక్కుతుంది. అటువంటి వ్యక్తి స్థానాన్ని భర్తీ చేసేందుకు కొన్ని ఎంపిక విధానాలను మార్చుకోవాల్సి రావచ్చు. విదేశీయులతో సహా గ్రూప్ వెలుపలి వ్యక్తులపైనా ఇప్పుడు దృష్టిసారిస్తున్నాం. ఈ విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ త్వరలోనే ఒక నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నాం’ అని కుమార్ పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting