అమ్మ, ఇన్ఫోసిస్‌యే మానాన్న ప్రపంచం: రోహాన్ మూర్తి

Posted By: Super

అమ్మ, ఇన్ఫోసిస్‌యే మానాన్న ప్రపంచం: రోహాన్ మూర్తి

బెంగళూరు: భారతదేశ ఐటి రంగంలో పరిచయం అక్కరలేని పేరు నారాయణ మూర్తి. 1987లో ఆరుగురు స్నేహితులతో ఒక చిన్నసంస్దగా ప్రారంభించి ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద రెండవ ఐటీ సంస్దగా తీసుకొనిరావడానికి ఆయన పడిన కృషి, పట్టుదల చెప్పలేనివి. ఆగస్టు 20వ తారీఖుతో ఇన్పోసిస్‌తో తన 30 సంవత్సరాల అనుబంధం తెగిపోయిందని ఇటీవలే నారాయణ మూర్తి వెల్లడించారు. ఇటువంటి సందర్బంలో నారాయణ మూర్తి తనయుడు మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌ కోసం తన తండ్రి ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి ఇన్నేళ్లుగా ఒక యంత్రంలా పనిచేసినట్లు నారాయణమూర్తి శుక్రవారం పదవీబాధ్యతల నుంచి వైదొలగిన సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశంలో తెలిపారు.

శుక్రవారం మూర్తి సతీమణి సుధామూర్తి పుట్టిన రోజు కూడా. శనివారం నారాయణమూర్తి జన్మదినం. మూర్తి మరో ఆరుగురితో కలసి 30 సంవత్సరాల కిందట ఇన్ఫోసిస్‌ను స్థాపించిన విషయం విదితమే. ఇప్పుడిక మూర్తి ఇన్ఫోసిస్‌కు గౌరవ ఛైర్మన్‌గా ఉంటారు. కాగా రోహన్‌ తన ప్రసంగంలో మా నాన్నకు తన జీవనంలో ఉద్వేగభరితమైన అంశాలు రెండే రెండు ఉన్నాయి.. ఒకటి మా అమ్మ, రెండోది కంపెనీలోని మీరంతా' అన్నారు. నాకు తెలిసి మా నాన్న రాత్రింబగళ్లు, ప్రతి సోమవారం నుంచి ప్రతి ఆదివారం వరకు ఎప్పుడూ ఒక యంత్రంలానే పనిచేశారు. ఆఫీసుకు వెళ్లినపుడల్లా ఉత్సాహంతో, నూతన జవసత్వాలతోనూ వెళ్లే వారు.

ఒక్కోసారి ఇంటికి అలసిపోయి వచ్చినా ఆయనలో సత్తువ ఇంకా మిగిలే ఉండేది. ఉద్యోగులతో కలసి శ్రమించడానికే సన్నద్ధంగా ఉండే వారు. ఆయనలోని ఉత్తేజమే పరోక్షంగా మా గృహ వాతావరణాన్ని మెరుగుపర్చడానికి తోడ్పడింద''న్నారు. మా నాన్నకు సంతోషాన్ని అందించిన మీ అందరికీ మా కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రోహన్‌ అన్నారు. ఇదే సందర్భంగా ఇన్ఫోసిస్‌ సహ-ఛైర్మన్‌ ఎస్‌.గోపాలకృష్ణన్‌, కార్యనిర్వాహక సహ-ఛైర్మన్‌ ఎస్‌.డి.శిబులాల్‌, నూతన ఛైర్మన్‌ కె.వి.కామత్‌లు నారాయణమూర్తి నాయకత్వ పటిమను గురించి, ఆయన దార్శనికతను గురించి, ఆయన అనుసరించిన కార్పొరేట్‌ పరిపాలన తీరుతెన్నులను గురించి వారి అభిప్రాయాలను వెల్లడించారు.

మూర్తి వారసత్వాన్ని ఇన్ఫోసిస్‌ మున్ముందుకు తీసుకువెళ్తుందని కామత్‌ వాగ్దానం చేశారు. ఇది ఇలా ఉంటే మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ టెలిఫోన్‌ ద్వారా తన శుభాకాంక్షలు అందజేయడం విశేషం. ఇన్ఫోసిస్‌ను ప్రపంచ స్థాయి కంపెనీగా గేట్స్‌ కొనియాడారు. భారత్‌లో ఉన్న నమ్మశక్యం కాని ప్రతిభకు ఇన్ఫోసిస్‌ అద్దం పట్టిందంటూ, మూర్తి నాయకత్వ ప్రతిభను ప్రశంసించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot