విప్రో నుంచి డెల్‌కు జంప్ అవుతున్న ఐటి నిపుణులు!

Posted By: Super

విప్రో నుంచి డెల్‌కు జంప్ అవుతున్న ఐటి నిపుణులు!

బెంగళూరు: ఐటి ఎగుమతుల్లో మూడవ అతిపెద్ద సంస్థ విప్రో నుంచి సీనియర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గడచిన మూడు నెలల్లో నలుగురు ఉన్నతాధికారులు సంస్థకు రాజీనామా చేయగా, వారిలో ముగ్గురు డెల్‌లో చేరారు. జనవరిలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సురేష్‌ వస్వానీని తొలగిస్తూ, ఆయన స్థానంలో టికె కురియన్‌ను నియమిస్తున్నట్టు విప్రో చీఫ్‌ అజీం ప్రేమ్‌జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వస్వానీ డెల్‌ ఇండియా హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆపై విప్రోలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ఎంతో మంది డెల్‌కు వలస వెళ్ళారు.

విప్రోలో నార్త్‌ చీఫ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా ఉన్న సిద్‌ నాయర్‌ ప్రస్తుతం డెల్‌ గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌గా ఉన్నారు. ఆయన రెండు నెలల క్రితం డెల్‌లో చేరారు. ఈయనతో పాటు ఇన్ఫోక్రాసింగ్‌ (గతంలో విప్రో విలీనం చేసుకున్న సంస్థ) బోర్డు మెంబర్‌ సమీర్‌ కిషోర్‌, హెల్త్‌ కేర్‌ బిజినెస్‌ జిఎం రమన్‌ సప్రాలు విప్రోను వీడారు. వీరిలో రమన్‌ డెల్‌ సర్వీసెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు స్వీకరించారు. ఇదిలావుండగా, విప్రో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా ఉన్న లక్ష్మణ్‌ బాడిగ తన ఉద్యోగానికి రాజీనామా చేసి యుఎస్‌ కేంద్రంగా నడుస్తున్న ఆంథీలియో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌లో చీఫ్‌ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా చేరారు.

ఆంథీలియోకు హెడ్‌గా కూడా విప్రో మాజీ ఉన్నతోద్యోగే కొనసాగుతుండడం గమనార్హం. విప్రోలోని టాలెంట్‌ రహస్యాలు వస్వానీకి క్షుణ్ణంగా తెలుసునని, వాటిని ఉపయోగించుకుని డెల్‌ కార్యకలాపాలను భారత్‌లో మరింతగా విస్తృతపరిచే దిశగా ఆయన అడుగులు వేయనున్నారని విశ్లేషకుల అభిప్రాయం. కాగా, గడచిన తొలి త్రైమాసికంలో విప్రో నికర లాభం జనవరి త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం తగ్గిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot