అంతంత మాత్రమే 'విప్రో క్యూ2' ఆర్దిక ఫలితాలు

Posted By: Super

అంతంత మాత్రమే 'విప్రో క్యూ2' ఆర్దిక ఫలితాలు

బెంగళూరు: అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటూ పాటపాడుతున్నారు విప్రో ఆర్దిక ఫలితాలు చూసిన వారంతా.. దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. క్యూ2 (జూలై-సెప్టెంబర్)లో విప్రో నికర లాభం రూ.1,300.9 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. పోయిన సంవత్సరం త్రైమాసికంలో నమోదైన రూ.1,284.9 కోట్లతో పోలిస్తే 1.24 శాతం వృద్ధి చెందింది. ఐటీ వ్యాపారంలో ఆకర్షణీయమైన పనితీరుతో పాటు డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత ప్రభావం కూడా దీనికి తోడ్పడిందని అన్నారు. అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం తాజా ఫలితాలను లెక్కించింది. కాగా, కంపెనీ ఆదాయం 17.64 శాతం పెరిగి రూ.9,094.5 కోట్లకు ఎగబాకింది. గత ఏడాది క్యూ2లో ఆదాయం రూ.7,730.5 కోట్లు.

ఈ ఫలితాలపై విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మాట్లాడుతూ స్థూల ఆర్థిక రంగంలో నెలకొన్న అస్థిరత భయాలే కొంపముంచాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఐటీ వ్యాపారాభివృద్ది ఆరోగ్యకరంగానే ఉందన్నారు. భవిష్యత్తులో తాము పెట్టే పెట్టుబడులు సంస్థ పురోగతికి కారణం కాగలవనే ఆకాంక్షను తెలిపారు. ఇదిలావుంటే రానున్న డిసెంబర్‌ 31తో ముగిసే మూడవ త్రైమాసికంలో 1,500 మిలియన్‌ డాలర్ల నుంచి 1,530 మిలియన్‌ డాలర్ల వరకు ఐటీ సేవల వ్యాపారం నుంచి ఆదాయం రావచ్చని విప్రో అంచనా వేసింది.

మరోవైపు ఈ రెండో త్రైమాసికంలో కొత్తగా సంస్థలోకి 5,240 మందిని తీసుకున్నామని దీంతో సెప్టెంబర్‌ 30 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,730 చేరిందని, అంతేగాక కొత్తగా 44 మంది కస్టమర్లను చేర్చుకున్నట్లు తెలిపింది. కేవలం ఐదుగురు కస్టమర్ల నుంచి 100 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందుకుంటున్నామని విప్రో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సురేష్‌ సేనాపతి తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot