యాహూ కొత్త అప్లికేషన్ ‘టైమ్ ట్రావెలర్’

Posted By: Prashanth

యాహూ కొత్త అప్లికేషన్ ‘టైమ్ ట్రావెలర్’

 

హైదరాబాద్: పోటీ టెక్నాలజీ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అత్యాధునిక మొబైల్ అప్లికేషన్స్‌ రూపకల్పన పై దృష్టిసారించినట్లు డిజిటల్ మీడియా కంపెనీ యాహూ గురువారం ప్రకటించింది. ముఖ్యంగా యాపిల్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ల అభివృద్ధిపై తాము ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు యాహూ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సీఈవో (ఆర్‌అండ్‌డీ) షోవిక్ ముఖర్జీ విలేకరులకు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అప్లికేషన్ ‘యాహూ టైమ్ ట్రావెలర్‌ను’ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఒక పట్టణాన్ని ఎంచుకొని, అక్కడ మీరు ఉండే సమయాన్ని తెలిపితే... ఆ పట్టణంలోని ముఖ్యమైన సందర్శనీయ స్థలాలను సమయానికి అనుకూలంగా ఎలా చూడవచ్చో ఈ అప్లికేషన్ తెలియచేస్తుంది. అంతేకాకుండా దర్శించాల్సిన ప్రదేశాల మార్గాన్ని కూడా తెలియచేస్తుంది. ప్రస్తుతమిది ఐఫోన్ మీద మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే దీనిని ఆండ్రాయిడ్ ఫోన్స్‌లోనూ వినియోగించేలా అభివృద్ధి చేస్తామని ముఖర్జీ తెలిపారు. ‘యాహూ యాక్సిస్’ పేరిట ఐఫోన్, ఐప్యాడ్‌ల కోసం ప్రత్యేకమైన సెర్చ్ ఇంజన్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

ఇంటెల్ దర్పణ్!

గ్రామీణ ప్రాంతాల్లో సైతం అంతర్జాల (ఇంటర్నెట్) వినియోగాన్ని సులభతరం చేస్తూ కొత్త తరహా ఆవిష్కరణకు ప్రాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్ శ్రీకారం చుట్టింది. ‘దర్ఫణ్’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఇంటెల్ లాంచ్ చేసింది. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిషు, గుజరాతీ, మరాఠీ వంటి 6 భాషల్లో దర్పణ్ లభిస్తుంది. ఇంటర్నెట్‌ను వినియోగించుకునేందుకు బ్రౌజర్ ఉపయోగించాల్సిన పని లేకుండా ఇది సహాయకారిగా ఉంటుంది. కంప్యూటర్‌లోకి దర్పణ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఏ భాషలో సమాచారం కావాలనుకుంటున్నది తెలియచేస్తే ఆ భాషకు సంబంధించిన సమాచారం అందుకోగలుగుతారు. దర్పణ్ హోం పేజీపై న్యూస్, గేమ్స్, మార్కెట్ వంటి గుర్తులు కనిపిస్తాయి, వాటిపై క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై వస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot