యూట్యూబ్‌లో ఇతర భాషల కంటెంట్ చూస్తుంటారా.. అయితే ఆటో డబ్బింగ్ ఫీచర్ గురించి తెలుసుకోండి?
యూట్యూబ్ ఇటీవల కాలంలో యూజర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల యూట్యూబ్ షాట్స్ గడువును మూడు నిమిషాలపాటు పొడిగించింది. అక్టోబర్ నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. గతంలో షాట్స్ గడువు కేవలం 1 నిమిషం మాత్రమే ఉండేది. దీంతోపాటు చిన్నారుల ఖాతాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా చిన్నారుల తమ యూట్యూబ్ ఖాతాల్లో ఎటువంటి వీడియోలు లేదా లైవ్ పోస్టులు చేసినా నోటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఫలితంగా చిన్నారులు తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. తాజాగా యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్.. వినియోగదారులతోపాటు ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్‌లకు అనుకూలంగా ఉంటుంది.

యూట్యూబ్ తాజాగా ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను (Youtube Auto Dubbing feature) తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుందని తెలిపింది. తన బ్లాగ్ ద్వారా ఈ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. యూట్యూబ్ కంటెంట్‌ను ఇతర భాషల్లోనూ చూసేందుకు వీలుగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
యూట్యూబ్ ఆటో డబ్బింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ? :
ఆటో డబ్బింగ్ ఫీచర్ కంటెంట్ క్రియేటర్లు అప్‌లోడ్ చేసిన వీడియోలను ఆటోమేటిక్‌గా ఇతర భాషల్లోకి అనువాదం చేస్తుంది. ఫలితంగా భాషతో ఇబ్బంది లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు ఈ కంటెంట్‌ను చూసేందుకు వీలుంటుంది. ఇలా డబ్బింగ్ చేయబడిన వీడియోలపై ప్రత్యేక లేబుల్ కనిపిస్తుందని యూట్యూబ్ చెబుతోంది.
ప్రస్తుతం ఈ ఆటో డబ్బింగ్ ఫీచర్ ద్వారా ఫ్రెంచ్, జర్మన్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, జపనీస్, ఇటాలియన్ కంటెంట్‌ను ఇంగ్లీష్‌లోకి మారుస్తుంది. దీంతోపాటు ఇంగ్లీష్ కంటెంట్‌ను ఆయా భాషల్లోకి మార్చుకోవచ్చు. ఇలా చేసిన వీడియోలపై ఆటో డబ్బడ్ అనే లేబుల్ కనిపించనుంది. ఈ ఫీచర్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది.
యూట్యూబ్‌లోని కంటెంట్ క్రియేటర్లు వీడియోలను అప్‌లోడ్ చేసే సమయంలో.. ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా వాయిస్‌ను గుర్తిస్తుంది. సపోర్టు చేసే భాషల్లోకి ఆటోమేటిక్‌గా మారుస్తుంది. అయితే ఏదైనా సందర్భంలో ఈ ఫీచర్ వాయిస్‌ను గుర్తించకుంటే.. ప్రస్తుత వీడియో కోసం ఈ ఆప్షన్ పనిచేయదని తెలియజేస్తుందని తన బ్లాగ్‌లో తెలిపింది.
ఇప్పటికి ఈ ఫీచర్‌ను కొత్తగా లాంచ్ చేస్తున్నామని.. అందువల్ల చిన్న చిన్న తప్పులు వచ్చే అవకాశం ఉందని యూట్యూబ్ తన పోస్ట్‌లో తెలిపింది. భవిష్యత్‌తో ఖచ్చితమైన విధంగా మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంది. ఈ ఫీచర్‌పై సూచనలు, సందేహాలను వ్యక్తం చేయవచ్చని తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
కంటెంట్ క్రియేటర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆటో డబ్బింగ్ ఫీచర్‌లో మార్పులు చేయనున్నట్లు తన బ్లాగ్‌లో యూట్యూబ్ వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా డబ్బింగ్ అయ్యే వాయిస్‌లకు మరింత కచ్చితత్వం, సహజత్వం తీసుకొచ్చేందుకు గూగుల్ డీప్ మైండ్, గూగుల్ ట్రాన్స్‌లేట్‌తో కలిసి పనిచేయడం కొనసాగిస్తుందని యూట్యూ్‌బ్ తన బ్లాగ్‌లో వెల్లడించింది.
డబ్బింగ్ వాయిస్ అవసరం లేకపోయినా లేదా ఒరిజినల్ వాయిస్‌లోనే వినాలని భావిస్తే.. ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్‌ను ఉపయోగించి ఒరిజినల్ వాయిస్‌ను వినొచ్చని యూట్యూబ్ చెబుతోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న సమయంలోనే డబ్బడ్ వీడియోలను యూట్యూబ్ స్టూడియోలో చూసేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








