ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు బ్లూటిక్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఎట్టకేలకు భారత్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లకు వెరిఫైడ్ బ్యాడ్జిని (బ్లూటిక్) అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్ తరహాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులు నగదు చెల్లించి బ్యాడ్జిని పొందవచ్చు. ఆండ్రాయిడ్, iOS యూజర్లు మెటా వెరిఫైడ్ బ్యాడ్జిని పొందవచ్చు.
ఈ సబ్‌స్క్రిప్షన్‌తో క్రియేటర్లు తన నెట్‌వర్క్‌ను పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని మెటా తెలిపింది. ప్రభుత్వ గుర్తింపుతో వెరిఫైడ్ బ్యాడ్జి ఉంటుందని మెటా పేర్కొంది. మరియు ప్రోయాక్టివ్ అకౌంట్ ప్రొటెక్షన్, అకౌండ్ సపోర్టు, సోషల్‌మీడియా ఖాతా మరింత మందికి చేరువవుతుందని మెటా పేర్కొంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులు మెటా వెరిఫైడ్ బ్యాడ్జిని పొందేందుకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలని సంస్థ స్పష్టం చేసింది. కనీస అర్హతలు లేకుంటే బ్యాడ్జిని పొందలేదని తెలిపింది.

ఖాతా ప్రామాణికత : మీరు ఏ సోషల్‌మీడియా ఖాతాకు వెరిఫైడ్ బ్యాడ్జిని పొందాలనుకుంటున్నారో ఆ ఖాతా ప్రామాణికమై ఉండాలని తెలిపింది. అంటే ఆ ఖాతా ఒక సంస్థ లేదా ఒక వ్యక్తికి చెందినదిగా ఉండాలని పేర్కొంది. మెటా వెరిఫైడ్ బ్యాడ్జి ఆప్షన్ తీసుకురాక ముందు కేవలం ప్రముఖులు, సంస్థలు మాత్రమే బ్లూటిక్‌ను పొందేందుకు అర్హత ఉండేది.
ఖాతా పూర్తికావాలి : మీరు ఏ సోషల్ మీడియా ఖాతాకు వెరిఫైడ్ బ్యాడ్జి కావాలని కోరుకుంటున్నారో.. ఆ ఖాతాకు ప్రొఫైల్ ఫోటో, బయో, కనీసం ఒ పోస్టు అయిన చేసి ఉండాలి. బ్యాడ్జి కోసం దరఖాస్తు చేసే సమయానికి ఖాతాను ఉపయోగిస్తూ ఉండాలి.
వయస్సు: తమ సోషల్‌మీడియా ఖాతాకు వెరిఫైడ్ బ్యాడ్జి కోసం దరఖాస్తు చేసే వాళ్లు తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి.
పాత పోస్టులకు సాక్ష్యాలు : సోషల్ మీడియా అకౌంట్‌లో ఉన్న పాత పోస్టులకు సంబంధించి సాక్ష్యాలు ఉండాలి. దరఖాస్తు చేసిన సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది.
గుర్తింపు కార్డు : సోషల్‌మీడియా అకౌంట్‌కు వెరిఫైడ్ బ్యాడ్జి కోసం దరఖాస్తు చేసుకొనే వారు ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. గుర్తింపు కార్డులోని పేరు, ఫోటోతో సోషల్‌మీడియా ఖాతా సరిపోలి ఉండాలి. కొంత మంది ఖాతాదారులు సెల్ఫీ వీడియోను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

బ్యాడ్జి లేదా బ్లూటిక్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి
* ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోకి వెళ్లండి
* పైన కుడివైపున సమాంతరంగా ఉన్న మూడు గీతలపై టాప్ చేయండి
* సెట్టింగ్‌ల్లోకి వెళ్లి.. అకౌంట్‌పై క్లిక్ చేసి.. రిక్వస్ట్ వెరిఫికేషన్ ఆప్షన్‌పైన టాప్ చేయండి.
* మీ పూర్తి వేరు నమోదు చేసి, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించండి.
* దరఖాస్తు పూర్తిచేసి సెండ్ పైన క్లిక్ చేయండి.
మీ దరఖాస్తుపైన సమీక్షించిన అనంతరం మీ సోషల్‌మీడియా ఖాతాకు బ్యాడ్జి ఇవ్వాలా వద్దా అనేది మెటా నిర్ణయం తీసుకుంటుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ సోషల్‌మీడియా ఖాతా పేరు పక్కన బ్లూ టిక్ లేదా బ్లూ బ్యాడ్జి వస్తుంది. ఇవాళ్టి నుంచి భారత్‌లో వెరిఫికేషన్ బ్యాడ్జికి సంబంధించి పేమెంట్ సర్వీస్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
ఆండ్రాయిడ్ లేదా iOS వినియోగదారులు మెటా వెరిఫైడ్ ఖాతా కోసం నెలకు 699 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ యూజర్ల కోసం కూడా సబ్‌స్క్రిప్షన్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెలకు రూ.599 వసూలు చేయవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








