వినికిడి సమస్యలు ఉన్నవారికి ఆండ్రాయిడ్ ఆరాకాస్ట్ ఓ వరం.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే..?
Auracast Android: రద్దీగా ఉండే విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్ల వంటి చోట్ల మాటలు స్పష్టంగా వినడం చాలా కష్టం. ముఖ్యంగా వినికిడి యంత్రాలు వాడేవారికి ఇది మరింత కష్టంగా ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ ఇప్పుడు 'ఆరాకాస్ట్' అనే కొత్త బ్లూటూత్ టెక్నాలజీతో ఈ సమస్యకు చెక్ పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా పబ్లిక్ ఆడియోను నేరుగా మీ వినికిడి యంత్రాలకే స్ట్రీమ్ చేసుకోవచ్చు.
అంటే శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ప్రతిదీ స్పష్టంగా వినిపిస్తుంది. మీ వినికిడి అనుభవం మరింత పర్సనలైజ్డ్‌గా మారుతుంది. గూగుల్ సంస్థ బ్లూటూత్ SIGతో కలిసి పనిచేసి 'ఆరాకాస్ట్'ను ఆండ్రాయిడ్‌లో కలిపేసింది. దీంతో ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి పబ్లిక్ ప్రదేశాల్లోని బ్రాడ్‌కాస్ట్‌లను ఈజీగా వినొచ్చు.

* ఆరాకాస్ట్ ఎలా పనిచేస్తుందంటే..
ఆరాకాస్ట్ బ్లూటూత్ LE ఆడియో టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది పబ్లిక్ బ్రాడ్‌కాస్ట్‌లను నేరుగా అనుకూలమైన వినికిడి యంత్రాలకు స్ట్రీమ్ చేస్తుంది. ఈ ఫీచర్‌తో, యూజర్లు ఆరాకాస్ట్ సపోర్ట్ చేసే ప్రదేశాలు, టీవీలు లేదా ప్రకటనలు చేసే చోట తమ వినికిడి యంత్రాలను కనెక్ట్ చేసుకోవచ్చు.
ఆరాకాస్ట్ కేవలం వినికిడి సమస్యలు ఉన్నవారికే కాదు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. పక్కనున్న వారికి ఇబ్బంది కలిగించకుండా పబ్లిక్ బ్రాడ్‌కాస్ట్‌లను ప్రైవేట్‌గా ఇయర్‌ఫోన్ల ద్వారా వినాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ పబ్లిక్ బ్రాడ్‌కాస్ట్‌లు అంటే.. బయట ప్రదేశాల్లో అందరికీ వినపడేలా చేసే ఆడియో లేదా సమాచార ప్రసారాలు.
* ఏ డివైజ్‌లు ఆరాకాస్ట్‌ను సపోర్ట్ చేస్తాయంటే..
పిక్సెల్ 9 సిరీస్ (ఆండ్రాయిడ్ 16 బీటాతో), శాంసంగ్ గెలాక్సీ డివైజ్‌లు (ఆండ్రాయిడ్ 15, వన్ UI 7తో) ఆరాకాస్ట్‌ను సపోర్ట్ చేసే మొదటి స్మార్ట్‌ఫోన్లు. GN హియరింగ్, స్టార్కీ వంటి బ్రాండ్‌ల నుంచి అనుకూలమైన వినికిడి యంత్రాలను వాడుతున్నవారు ఈ ఫోన్లతో కనెక్ట్ చేసి పబ్లిక్ ప్రదేశాల్లో మరింత మెరుగైన ఆడియోను పొందొచ్చు.
* QR కోడ్‌తో ఈజీ కనెక్షన్
ఆండ్రాయిడ్, ఆరాకాస్ట్ బ్రాడ్‌కాస్ట్‌లకు కనెక్ట్ అవ్వడం చాలా సులువు చేసింది. సెట్టింగ్స్‌లో వెతుక్కునే బదులు, పబ్లిక్ ప్రదేశంలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, వెంటనే స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమైన ప్రకటనలు లేదా ఎంటర్‌టైన్‌మెంట్‌ను యాక్సెస్ చేయడం చాలా సౌకర్యవంతంగా మారుతుంది.
కొన్ని బ్రాడ్‌కాస్ట్‌లు అందరికీ ఓపెన్‌గా ఉంటాయి, మరికొన్నింటికి యాక్సెస్ కోసం పాస్‌వర్డ్ అవసరం కావచ్చు. ఇక్కడ బ్రాడ్‌కాస్ట్‌లు అంటే విమానాశ్రయ ప్రకటనలు, రైల్వే స్టేషన్ అనౌన్స్‌మెంట్లు, షాపింగ్ మాల్ ప్రకటనల వంటివి ఏవైనా కావచ్చు. హియరింగ్ ఎయిడ్స్‌ని వీటికి కనెక్ట్ చేసుకొని క్లారిటీగా వినొచ్చు.
* పబ్లిక్ ప్రదేశాలకు గేమ్-ఛేంజర్
మరింత ఎక్కువ పబ్లిక్ ప్రదేశాలు ఆరాకాస్ట్‌ను స్వీకరించడంతో, విమానాశ్రయాలు, మాల్స్, పార్కులు, రైల్వే స్టేషన్‌లు, కచేరీలలో యూజర్లు మెరుగైన వినికిడి అనుభవాలను పొందొచ్చు. ఈ టెక్నాలజీ ముఖ్యమైన సందేశాలు, ప్రకటనలు వినాల్సిన వారికి స్పష్టంగా చేరేలా చేస్తుంది. అంతేకాదు, పబ్లిక్ ప్రదేశాల నిర్వాహకులు సందర్శకులతో మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఆరాకాస్ట్ పబ్లిక్ ఆడియో స్ట్రీమింగ్‌లో ఒక విప్లవం సృష్టించబోతోంది. ఇది వినికిడి యంత్రాల (Hearing aids)ను మరింత ఉపయోగకరంగా, పబ్లిక్ ప్రదేశాలను అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుంది.


Click it and Unblock the Notifications








