ఫొటోల్లో వాటర్‌మార్క్‌లు క్షణాల్లో మాయం చేస్తోన్న జెమిని 2.0 AI టూల్.. కాపీరైట్లకు ఇక కష్టకాలమేనా?
Gemini Removes Watermarks: గూగుల్ సంస్థ సరికొత్తగా జెమిని ఫ్లాష్ 2.0 అనే ఒక అద్భుతమైన ఏఐ (కృత్రిమ మేధస్సు) మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది ఫోటోల్లోని వాటర్‌మార్క్‌లను ఇట్టే తొలగించగలదు. ఈ టూల్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నా, సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది కాపీరైట్ ఉన్న ఫోటోల్లోని వాటర్‌మార్క్‌లను కూడా చెరిపేసి, ఆ ఖాళీ స్థలాన్ని అసలు అక్కడ ఏమీ లేనట్లుగా నింపేస్తోంది.
ప్రస్తుతం ఇది డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నా, దీని సామర్థ్యాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే అవగాహన లేని ప్రజలు కాపీరైట్స్ ఉన్న మెటీరియల్స్‌ను తమ మెటీరియల్స్ లాగా మార్చేయవచ్చు. అలా దీనిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని చాలామంది ఆందోళన చెందుతున్నారు.

నిజానికి ఫొటోలను ఎడిట్ చేసే చాలా యాప్స్‌లో వస్తువులను తొలగించే ఫీచర్లు ఉన్నాయి. కానీ జెమిని ఫ్లాష్ 2.0 మాత్రం వాటిన్నింటినీ మించిపోయింది. ఇది పెద్ద పెద్ద స్టాక్ ఫొటో వెబ్‌సైట్‌లైన గెట్టి ఇమేజెస్ వంటి వాటి ఫోటోల్లోని వాటర్‌మార్క్‌లను కూడా సునాయాసంగా తీసేస్తోంది.
ఇతర ఏఐ మోడల్స్ వాటర్‌మార్క్‌ను తీసేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని సరిగ్గా నింపలేక తడబడతాయి. కానీ జెమిని ఫ్లాష్ 2.0 ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ మాత్రం ఆ పనిని చాలా కచ్చితంగా చేస్తోంది. మార్పులు చేసినట్లు ఎవ్వరూ గుర్తుపట్టలేనంత సహజంగా ఆ భాగాన్ని నింపుతోంది. దీనివల్ల ఓనర్ల కాపీరైటెడ్ మెటీరియల్‌ను తస్కరించే అవకాశం ఉంది.
* ఇతర మోడల్స్ సంగతేంటి..
టెక్నాలజీ దిగ్గజాలైన ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ కంపెనీలు మాత్రం ఇలాంటి సమస్యలు రాకుండా తమ ఏఐ మోడల్స్‌పై చాలా కఠినమైన ఆంక్షలు పెట్టాయి. ఉదాహరణకు DALL-E అనే ఏఐ టూల్ కాపీరైట్ ఉన్న క్యారెక్టర్ల బొమ్మలు వేయడానికి ఒప్పుకోదు. అలాగే క్లాడ్ 3.7 సోనెట్ అనే మోడల్ వాటర్‌మార్క్‌లను తొలగించడం "అనైతికం, చట్టవిరుద్ధం" అని తేల్చి చెబుతుంది.
కానీ జెమిని ఫ్లాష్ 2.0 మాత్రం అలాంటి నియంత్రణలు ఏమీ లేకుండానే దూసుకుపోతోంది. అయితే గూగుల్ దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలోపు కచ్చితంగా కొన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. లేకపోతే చట్టపరమైన చిక్కులు తప్పవు. దీనివల్ల ఒక్క గూగుల్ మాత్రమే కాకుండా వాటిని వాడుకున్న వారందరూ ఇబ్బందుల్లో పడతారు.
* జోక్ ఏంటంటే..
జెమిని ఫ్లాష్ 2.0 వాటర్‌మార్క్స్‌ను తొలగించగలదు కానీ, ఇది తాను తయారుచేసిన లేదా ఎడిట్ చేసిన ఫొటోలకు మాత్రం తన సొంత వాటర్‌మార్క్‌ను జత చేస్తుంది. అంటే ఇది అసలు యజమాని పేరును చెరిపేసి, తానే ఎడిట్ చేశానని చెప్పడానికి తన ముద్ర వేసుకుంటుంది. ఇది విడ్డూరమైన పరిస్థితి.
* చట్టరీత్యా నేరం
అమెరికా కాపీరైట్ చట్టం ప్రకారం, యజమాని అనుమతి లేకుండా వాటర్‌మార్క్‌ను తొలగించడం చట్టరీత్యా నేరం. అందుకే కాపీరైట్ హక్కులు ఉన్నవారు ఈ మోడల్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గూగుల్ మాత్రం తమ ఏఐని కాపీరైట్ ఉల్లంఘన కోసం వాడటం తమ నిబంధనలకు విరుద్ధమని చెబుతోంది.
ప్రస్తుతం ఈ టూల్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని, డెవలపర్‌ల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గూగుల్ భవిష్యత్తులో మరిన్ని భద్రతా ఫీచర్లను పెట్టినా, ఒకసారి ఇలాంటి టెక్నాలజీ బయటకు వస్తే దాన్ని నియంత్రించడం చాలా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓపెన్-సోర్స్ మోడల్స్ భద్రతా నియమాలను దాటవేయగలవు. దాంతో ఈ టెక్నాలజీ దుర్వినియోగాన్ని పూర్తిగా ఆపడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








