ఇన్‌స్టాగ్రామ్‌లో జాతకం చెప్పించుకుంది.. కట్ చేస్తే రూ.6 లక్షలు గోవిందా!
Instagram Astrologer Scam: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ నకిలీ జ్యోతిష్యుడిని నమ్మి ఏకంగా రూ.6 లక్షలు పోగొట్టుకుంది. ప్రేమ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆత్రుతతో మొదలైన సంభాషణ.. చివరకు ఆమెకు భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. ఆన్‌లైన్‌లో కనిపించే తెలియని సర్వీసులను గుడ్డిగా నమ్మితే ఎంత ప్రమాదమో ఈ ఉదంతం మరోసారి కళ్లకు కట్టింది.
* మోసపూరిత వలలో చిక్కుకున్న యువతి
ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆ యువతి, ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా ఓ ఆస్ట్రాలజర్ పేజీ కనిపించింది. ఆ ప్రొఫైల్‌లో అఘోరి బాబా ఫొటో ఉండటంతో అది నిజమైనదని నమ్మిందామె. తన పెళ్లి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ పేజీలో ఇచ్చిన నంబర్‌కు మెసేజ్ చేసింది.

వెంటనే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. తాను గొప్ప జ్యోతిష్యుడినని నమ్మబలికాడు. ఆమె పేరు, పుట్టిన తేదీ తీసుకుని జాతకం చెప్పాడు. ప్రేమ వివాహం చేసుకునే యోగం ఉందని చెప్పి ఊరించాడు. అయితే, ఆ ఆనందం నెరవేరకుండా "గ్రహాల అడ్డంకులు" ఉన్నాయని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.
* పూజల పేరుతో భారీ దోపిడీ
వాటిని తొలగించాలంటే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని సూచించాడు. అంతే.. అక్కడి నుంచే అసలు మోసం మొదలైంది. మొదట విజయ్.. చిన్న పూజ కోసం రూ.1,820 మాత్రమే అడిగాడు. అది చిన్న అమౌంట్ కావడం ఎవరైనా ఇంత డబ్బులు అడగటం సహజమని నమ్మిన ఆ యువతి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపింది.
ఆ తర్వాత మళ్లీ కొత్త సమస్యలు ఉన్నాయని, మరిన్ని పూజలు చేయాలని చెప్పడం మొదలుపెట్టాడు. నెగెటివిటీ పోగొట్టుకుంటున్నానని, పాజిటివిటీని ఆకర్షిస్తున్నానని నమ్మి, ఆమె విడతల వారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తూనే ఉంది. ఇలా కొద్ది రోజుల్లోనే దాదాపు రూ. 5.9 లక్షలు అతడికి కట్టేసింది.
* ఎమోషనల్ బ్లాక్‌మెయిల్, లీగల్ బెదిరింపులు
చివరకు అనుమానం వచ్చిన ఆ యువతి డబ్బులు తిరిగి ఇవ్వమని విజయ్‌ని అడిగింది. మొదట్లో రూ.13,000 వెనక్కి ఇచ్చాడు. ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టాడు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. డబ్బులు తిరిగి అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ అనే మరో వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు.
తాను లాయర్‌నని పరిచయం చేసుకున్నాడు. విజయ్ డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తుండటంతో సూసైడ్ చేసుకునేలా ఉన్నాడని, ఇక డబ్బులు అడగడం ఆపేయమని బెదిరించాడు. అప్పుడు మోసపోయానని గ్రహించిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయ్, ప్రశాంత్ ఇద్దరూ మోసగాళ్లని, ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి స్కామ్‌లు చేస్తున్నారని తేలింది. వీరిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, చీటింగ్ సెక్షన్ 318 కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
* జాగ్రత్తలు
మొదటగా, ఎవరైనా జ్యోతిష్యులు లేదా ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్లు మాయాజాలం చేస్తామని, అద్భుత ఫలితాలు ఇస్తామని గ్యారెంటీ ఇస్తే వెంటనే అనుమానించాలి. నిజమైన నిపుణులు ఎప్పుడూ అవాస్తవ హామీలు ఇవ్వరు. అలాగే, తెలియని వ్యక్తులెవరికీ, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పరిచయమైన వారికి, సరిగ్గా ధృవీకరించకుండా పెద్ద మొత్తంలో డబ్బులు పంపడం చాలా ప్రమాదకరం.
ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. మోసగాళ్లు తరచూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు. ఆత్మహత్య బెదిరింపులు లేదా భావోద్వేగాలను ఉపయోగించి మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే అప్రమత్తం కావాలి. ఏదైనా ఆన్‌లైన్ సర్వీసును ఉపయోగించే ముందు, అది నకిలీయో కాదో నిర్ధారించుకోవాలి.
వెబ్‌సైట్లు, రివ్యూలు, ఇతరత్రా సమాచారం ద్వారా వారి గురించి తెలుసుకోవాలి. ఒకవేళ మోసం జరుగుతోందని అనుమానం వస్తే, వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








