పెను విషాదం వెనుక భయానక వాస్తవాలు

Written By:
  X

  చరిత్రలో చూడనిది.. ఊహించడానికి కూడా సాహసించలేనిది. ఏదైనా ఉంది ఉంటే అది హిరోషిమా విషాదమే. 70 ఏళ్ల క్రితం నేలమట్టమైన నగరం.ప్రపంచం ఇప్పటికీ ఆ గాయాన్ని మర్చిపోలేకపోతోంది. దేశాల మధ్య యుద్ధకాంక్షకు అక్కడ సమాధులు నిలువెత్తు నిదర్శనం. మనం సాధించిన సాంకేతిక విజ్ఞానమే మానవాళిని మింగేసిన విషాదానికి అద్దం పట్టిన ఘటన. లక్షలాది అమాయకులైన ప్రజల ప్రాణాలను విషపు వాయవుల్లో కలిసిన దుర్ఘటన. అంతులేని అమెరికా ఉగ్రవాదానికి అదే తొలి ఘటన.. అదే చివరి ఘటన... మనిషి సాటి మనుషులపై ప్రదర్శించిన రాక్షసత్వానికి పరాకాష్ఠ. ప్రపంచం మర్చిపోయిన ఎన్నో విషయాలు ఆ పెను విషాదంలో దాగున్నాయి. మిగతా కథనం స్లైడర్ లో..

  Read more: పెద్దన్న చెవిలో పాకిస్తాన్ అధ్యక్షుడి పూలు

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  పేరులో మాత్రమే లిటిల్‌..

  రెండో ప్రపంచయుద్ధం ముగింపునకు వచ్చిన వేళ.. 1945, ఆగస్టు 6.. ఉదయం గం.8.15 నిమిషాలు. మరియానా ద్వీపం నుంచి బి-29 అనే బాంబర్ విమానం జపాన్‌లోని హిరోషిమా నగరంపైకి వచ్చింది. అత్యంత శక్తిమంతమైన బాంబును ఈ అమెరికన్‌ యుద్ధ విమానం జారవిడిచింది. అదే లిటిల్‌ బాయ్‌. పేరులో మాత్రమే లిటిల్‌. కానీ మానవ చరిత్రలోనే అత్యంత పెను విషాదాన్ని, కనీవిని ఎరగని మారణహోమాన్ని సృష్టించే బాంబుగా దీనిని ఎవరూ ఊహించలేదు.

  హిరోషిమా ప్రజల ప్రాణాలు అనంతవాయువుల్లో..

  3 లక్షల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు పెంచింది. 28 మీటర్ల వ్యాసంలో భారీ అగ్నిగుండం ఏర్పడింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అణుబాంబు పేలుడు ధాటికి హిరోషిమా ప్రజల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అణుబాంబు ద్వారా ధ్వంసం చేయబడ్డ తొలి నగరంగా హిరోషిమా చరిత్ర పుటలకెక్కింది. చారిత్రక నగరం నేలమట్టం అయింది. సామూహిక మారణకాండకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఊహించని పేలుడుకు 90వేల మంది అసువులు బాసారు.

  అంతలోనే మరో అలజడి..

  ఇప్పటికీ ఆ నగరానికి చెందిన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసిన ఘోరకలిగా మిగిలిపోయింది. ఈ విషాదం నుంచి జపాన్‌ కోలుకోలేదు. అంతలోనే మరో అలజడి.. మళ్లీ మూడు రోజులకే అంటే... ఆగస్టు 9, 1945 నాగసాకిపై మరో అణుబాంబు. ఈసారి లిటిల్‌ బాయ్‌ కాదు.. ఫ్యాట్ మ్యాన్‌. కొకిరో పట్టణాన్నిటార్గెట్‌ చేసింది. కానీ యూఎస్‌ బాంబర్‌ బాక్‌స్కార్‌కు వాతావరణం అనుకూలించలేదు. టార్గెట్‌ మారింది. కొకిరోకు బదులుగా నాగసాకి క్షణాల్లో మాడిమసైంది. శక్తివంతమైన పేలుడుకు 40వేల మంది అప్పటికప్పుడే మృతిచెందారు. ఏడాదిలోనే దాదాపు లక్షమంది అమాయక ప్రజలు అణుబాంబు చిమ్మిన మంటలో బూడిదయ్యారు.

  ఇంతవరకు మనకు చెపుతూ వస్తున్నది..

  ఇంతవరకు మనకు చెపుతూ వస్తున్నది, మనకు తెలిసినది. మన పాఠ్య పుస్తకాలు చెప్పేవి ఏమిటంటే అమెరికా జరిపిన అణు బాంబుల దాడుల వల్లే జపాను యుద్ధ విరమణ చేసి మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. ఆ విధంగా రెండవ ప్రపంచయుద్ధం పరిసమాప్తమైంది. వాస్తవాలను చూస్తే అమెరికా ఆధిపత్యానికి అహంకారానికే ఈ పెను విషాదం జరిగిందని తెలుస్తోంది. రెండవ ప్రపంచయుద్ధానికి దీనికి సంబంధంలేదని తెలుస్తోంది.

  దానిని ప్రయోగించడం చరిత్రలో ఒక గొప్ప విషయం..

  అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్‌ మొదటి బాంబును హిరోషిమాపై వేసిన తర్వాత మాట్లాడుతూ ''అది ఒక అటామిక్‌ బాంబ్‌. దానిని ప్రయోగించడం చరిత్రలో ఒక గొప్ప విషయం'' అని వర్ణించాడు. ఆ తరువాత మాట్లాడుతూ ''హిరోషిమా, నాగసాకి సాధారణ పౌరులపై అణుబాంబులు వేయకుండా వుండే ప్రత్యామ్నాయాలు ఏవి అమెరికాకు లేకుండినవి. వాటిని గనక వేయకుండా వుండి నట్లయితే ఉన్మాద జపనీయులు లొంగిపోయి ఉండేవారు కాదు.

  అణు బాంబు దాడులు సరైనవే..

  జపాన్‌ దీవులను అధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో లక్షల కొలది అమెరికా వీర సైనికులు తమ ప్రాణత్యాగం చేయ వలసి వచ్చేది'' అని అన్నాడు. అణు బాంబు దాడులు సరైనవే అని ట్రూమన్‌ ప్రపంచం ముందు సమర్ధించుకున్నాడు.

  అణు బాంబుల దాడికి రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి..

  కానీ ఇవి చారిత్రక వాస్తవాలు కావు. అణు బాంబుల దాడికి రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి ఎటువంటి సంబంధం లేదు! అణు బాంబుల దాడులను అమెరికా ఉద్దేశ పూర్వకంగానే చేసింది . దాని వెనుక గల రాజకీయాలు వేరే వున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి నిర్ణయాలకు సంబంధించిన పలు కీలక దస్తావేజులుపై కొన్ని సంవత్సరాల క్రితమే అమెరికా వర్గీకరణ ఎత్తివేసింది. కావున అవన్నీ నేడు బహిరంగ పత్రాలుగా మారి చరిత్ర పరిశోధకులకు నిజాలను తెలియజేస్తున్నాయి.

  న్యూయార్కులోని మాన్‌హట్టన్‌లో..

  అణుబాంబును రూపొందించే ప్రక్రియ అమెరికాలో 1942లో అత్యంత గోప్యంగా న్యూయార్కులోని మాన్‌హట్టన్‌లో మొదలైంది. అందుకని ''మాన్‌హట్టన్‌'' ప్రాజెక్టుగా పేర్కొంటారు. జర్మనీలో నాజీలు అణు బాంబును రూపొందిస్తున్నారు, అది ప్రపంచానికి అత్యంత ప్రమాదం. సో నాజి జర్మనీని ఎదుర్కోవాలంటే అమెరికా కూడా అణుబాంబును తయారుచేయాలి. ఇవి బయటి ప్రపంచానికి నమ్మబలికిన కారణాలు.

  నాజి అణు బాంబు అనేదే ఒక బూటకమని...

  కాని ప్రముఖ అమెరికా రచయిత మికిజడ్‌ తన ఇటీవల వ్యాసంలో అసలు నాజి అణు బాంబు అనేదే ఒక బూటకమని అంటాడు. అప్పటి బ్రిటిష్‌ సీక్రెట్‌ ఇంటిలిజెన్స్‌ సర్వీసు (ఎస్‌.ఐ.ఎస్‌.) అధికారిక పత్రాల సమాచారాన్ని బట్టి జర్మనీలో అణుబాంబు ప్రాజెక్టులంటూ ఏవీ లేవని స్టీవర్ట్‌ ఉధాల్‌, మాక్‌ జార్జ్‌ బండి మొదలగు చరిత్రకారుల రచనలను వుటంకిస్తూ మికిజడ్‌ తన వాదన వినిపిస్తాడు.

  జర్మనీ అపజయాల పరంపరను తెలుసుకున్న హిట్లర్‌..

  ఈ విషయం అట్లా వుంచితే, జర్మనీ అధికారిక లొంగుబాటు 1945 మే7న జరిగినప్పటికీ, దాని వరుస ఓటముల పర్వం 1943 జనవరి నుండే మొదలైంది. జర్మనీ అపజయాల పరంపరను తెలుసుకున్న హిట్లర్‌ ఏప్రిల్‌ 30, 1945న తన మిలిటరీ బంకర్లోనే తుపాకి పేల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో జర్మని ఓటమి మరింత ప్రస్పుటమైంది.

  అప్పటి సోవియట్‌ యూనియన్‌కు తన మేటి సైనికసత్తా ..

  దీనితో నాజి జర్మని అణు బాంబు భయం కూడా తేటతెల్లమైంది. అమెరికా ఎలాగైనా నూతన బాంబును తయారుచేసి దానిని ప్రయోగించి ప్రపంచానికి, ముఖ్యంగా అప్పటి సోవియట్‌ యూనియన్‌కు తన మేటి సైనికసత్తా ప్రదర్శించి ఒక ముందస్తు హెచ్చరిక జారీ చేయాలనుకుంది.

  ఇటలీ, జర్మని కంటే సుమారు రెండు సంవత్సరాల ముందే ...

  రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్య కూటమికి వ్యతిరేకంగా వున్న మూడు రాజ్యాల కూటమిలోని ఇటలీ, జర్మని కంటే సుమారు రెండు సంవత్సరాల ముందే 1943 సెప్టెంబరులో లొంగిపోయింది. జర్మని లొంగుబాటు తరువాత ఒంటరైన జపాన్‌ 1945 జూలై నుండి తన లొంగుబాటుకు అవసరమైన అంశాలపై సోవియట్‌ యూనియన్‌తో అనధికారిక సంప్రదింపులు మొదలుపెట్టింది.

  అట్లాంటి సందర్భంలో జరగాల్సింది వేగవంతమైన దౌత్య ప్రక్రియ..

  ఆ విధంగా జపాన్‌ లొంగుబాటు తథ్యమని మిత్ర రాజ్యాల కూటమికి తెలిసిపోయింది. అట్లాంటి సందర్భంలో జరగాల్సింది వేగవంతమైన దౌత్య ప్రక్రియ కాని అణు బాంబుల దాడి కాదు. సోవియట్‌ యూనియన్‌తో జపాన్‌ జరుపుతున్న సంప్రదింపుల సమాచారం తెలిసి కూడా అమెరికా తన అణుబాంబుల తయారీ, దాడి కార్యక్రమాలను కొనసాగించింది.

  చర్చలో 'జాతి' పరమైన అంశాలు ముందుకు..

  అణు బాంబును ఏ ప్రాంతంలో వేయాలి అనే అంశంపై జరిగిన చర్చలో 'జాతి' పరమైన అంశాలు ముందుకు వచ్చాయి. యూరపులోని ప్రజలు, అమెరికాలోని ప్రజలు ఒకే శ్వేత జాతి సంతతే. కావున అక్కడి కంటే వేరే జాతికి చెందిన ఆసియాలోని జపానులో వేయడమే సరైందిగా నిర్ణయానికి అమెరికా వచ్చింది. ఈ మేరకు ఒక టార్గెట్‌ కమిటీ ఏర్పడింది.

  క్యోటో, హిరోషిమా, కోకురా, నాగసాకి. నిగాత...

  క్యోటో, హిరోషిమా, కోకురా, నాగసాకి. నిగాత. బాంబు ప్రభావాన్ని ప్రత్యేక అంచనాకు ఎంచుకోబడిన నగరాలపై సాంప్రదాయ బాంబు దాడులు మినహాయించారు. ఆ మర్మం తెలియని ఈ నగరాల ప్రజలు తమ నగరాలపై అమెరిక సైన్యాలు బాంబుల వర్షం కురిపించక పోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. రాజధాని టోక్యో కాకుండా మొదటి టార్గెట్‌గా క్యోటోను ఎన్నుకోవడం వెనక కూడా మతలబు వుంది.

  అందుకు తగిన టార్గెట్‌ క్యోటో మాత్రమే..

  టోక్యో కేవలం చక్రవర్తి స్థానమనే పేరు గాని దానికి వ్యూహాత్మక ప్రాధాన్యత లేదు. టార్గెట్‌ కమిటీ వ్యూహాత్మక అంశాలతో పాటు మనో వైజ్ఞ్యానిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. అందుకు తగిన టార్గెట్‌ క్యోటో మాత్రమే. అందువల్ల దానినే అటంబాంబు దాడికి ప్రప్రథమ లక్ష్యంగా టార్గెట్‌ కమిటీ మే 28, 1945న జరిగిన తన చివరి సమావేశంలో నిర్ణయించింది.

  జపానులో అత్యంత మేధోపరమైన జనాభా కలిగిన నగరం..

  అది మిలిటరీ పారిశ్రామిక నగరమే కాక జపానులో అత్యంత మేధోపరమైన జనాభా కలిగిన నగరం. బాంబు పడి బతికినవారు, తప్పించుకున్నవారు అణుబాంబు సామర్ధ్యాన్ని, ప్రజల వ్యధను సక్రమంగా అంచనా వేయగలరు, దాని ప్రభావం గురించి ప్రపంచానికి సరిగ్గా చెప్పగలరనే టార్గెట్‌ కమిటి అభిప్రాయం వెనుక ఎంతటి శ్యాడిస్టు ఆలోచనలున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

  ఆరు కోట్ల పైచీలుకు కరపత్రాలను పలు నగరాలపై..

  మరో వాస్తవ ఉదాహరణ జపాన్‌ ప్రజల మానసికంగా ఉద్వేగపరచడానికి ముందు ముందు జరిపే బాంబుల దాడి ప్రభావాలపై ఆరు కోట్ల పైచీలుకు కరపత్రాలను పలు నగరాలపై విమానాల పైనుండి అమెరికా సైన్యం జారవిడవడం. ఇవే కాదు. తప్పనిసరిగా ''విజువల్‌ బాంబింగ్‌'' మాత్రమే చేయాలనీ ''రాడార్‌ బాంబింగ్‌''ను చేయరాదని కూడా కమిటి నిర్ణయించింది.

  విస్పోటన అనంతర దృశ్యాల చిత్రీకరణ...

  రాడారు పర్యవేక్షణ ద్వారా బాంబు వేసే పద్ధతిలో విస్పోటన అనంతర దృశ్యాల చిత్రీకరణ సాధ్యంకాదు. అదే దృశ్య మాన(విజువల్‌) పద్ధతిలో అయితే పూర్తీ బాంబింగు ప్రక్రియ, తదనంతర పరిస్థితులను చిత్రీకరించవచ్చు. ఇంకా పలురకాల పరీక్షలు కూడా చేయొచ్చని కమిటీ బావించింది.

  బోయింగ్‌ బి-29 బాంబర్‌ విమానం..

  క్యోటోపై బాంబు వేయడానికి ఆగస్టు5 రాత్రి 2 గంటల 45 నిమిషాలకు ''ఎనొల గే'' అనబడే బోయింగ్‌ బి-29 బాంబర్‌ విమానం (అది ఆ విమానం నడిపిన పాల్‌ డబ్ల్యూ టిబ్బేట్‌ తల్లి పేరు) పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని టినియన్‌ దీవుల నుండి మొత్తం 4,400 కిలో గ్రాముల బరువు గలిగిన (దానిలో 65 కిలో గ్రాముల యురేనియం-235తో నింపిన) ''లిటిల్‌ బాయ్'' అనే ఆటం బాంబును వేసుకుని బయలుదేరింది.

  డాక్టర్‌ షీమా సర్జకల్‌ క్లినిక్‌''పై మొదటి అణు బాంబు ..

  కాని క్యోటో దట్టమైన మేఘాలతో అలముకొని వుంది. అందువల్ల రెండో లక్ష్యమైన హిరోషిమా వైపు విమానాలు మళ్ళించి లక్ష్యం చేసిన అయియో వంతెనపై కాకుండా మనుషులకు ప్రాణం పోసే ''డాక్టర్‌ షీమా సర్జకల్‌ క్లినిక్‌''పై మొదటి అణు బాంబు పేలింది. 70వేల నుండి 80వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోగా మరో 70వేల మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా లోని 90 శాతం వైద్యులు 93 శాతం నర్సులు బాంబు బారిన పడటంతో గాయాలతో బయటపడిన వారికి తక్షణ చికిత్సలు చేసే వారు కరువైనారు.

  ఒక వేళ బాంబు పూర్తీ 100 శాతం సామర్ధ్యంతో ..

  ఒక వేళ బాంబు పూర్తీ 100 శాతం సామర్ధ్యంతో పనిచేసినట్లయితే ఇంకెంత ఘోరకలి జరిగేదో ఊహకు అందని విషయం. కేవలం రెండు రోజుల విడిది తరువాత మూడవ రోజు మరో బాంబు నాగసాకిపై ఎందుకు ప్రయోగించ వలసి వచ్చింది? కారణం జపానును దారికి తీసుకు రావడమో, యుద్ధాన్ని అంత మొందించడమో అనుకుంటే పొరబాటే.

  రెండు వేరు వేరు రసాయనాలతో రూపొందించిన అణు బాంబులను ..

  అంతకుముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేరు వేరు రసాయనాలతో రూపొందించిన అణు బాంబులను వాస్తవ పరిస్థితులలో ప్రయోగించి వాటి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం, రెండింటి ప్రభావాలను అధ్యయనం చేయడం. అందుకు ముగింపునకు చేరుకున్న రెండవ ప్రపంచ యుద్ధ కాలాన్ని ఆసరాగా తీసుకుని, ప్రయోగశాలగా జపాన్‌ భూబాగాన్ని, ప్రయోగ వస్తువులుగా జపాన్‌ ప్రజలను వ్యూహాత్మకంగా వాడుకోవడం అమెరికా ప్రధాన ఉద్దేశ్యం.

  నాగసాకిపై వేసిన బాంబును ప్లూటోనియం-239..

  హిరోషిమా బాంబు యురేనియం-235 ద్వారా ఒక సులభమైన కెమికల్‌ డిజైన్‌తో తయారు చేశారు. అందుకు భిన్నంగా నాగసాకిపై వేసిన బాంబును ప్లూటోనియం-239 ద్వారా అత్యంత సంక్లిష్టమైన కెమికల్‌ డిజైనుతో రూపొందించారు. హిరోషిమా బాంబుతో యురేనియం-235 బాంబు పాటవం, ప్రభావం ఏమిటో తెలిసింది మరింత శక్తివంతమైన ప్లుటోనియం-239 పాటవం, ప్రభావం ఏమిటో తెలియాలి కదా? అందుకని అమెరికాకు నాగసాకిపై మరో బాంబు ప్రయోగం అవసరమైంది.

  రెండో అణుబాంబు ప్రయోగానికి ఎంచుకున్న మొదటి టార్గెట్‌ కొకూర..

  నిజానికి రెండో అణుబాంబు ప్రయోగానికి ఎంచుకున్న మొదటి టార్గెట్‌ కొకూర. ఆ నగరం చేరుకోవడానికే టినియన్‌ దీవులనుండి బి-29 విమానాలు బయలుదేరినాయి. కోకూరపై బాంబు వేయడానికి పలు ప్రయత్నాలు చేసినాయి. కాని బాంబు వేయడానికి క్యోటో వాలే ఇక్కడ కూడా సాధ్యం కాలేదు.

  విమాన ఇంధనం తగ్గుతుండటంతో నాగసాకి వైపు...

  ఈ లోపు విమాన ఇంధనం తగ్గుతుండటంతో నాగసాకి వైపు వెళ్లి రెండవ బాంబును నాగసాకి నగరంపై జార విడిచినారు. ''ఫ్యాట్‌ మాన్‌''గా పిలవబడ్డ ఈ బాంబు హిరోషిమా బాంబు కంటే ఎక్కువ శక్తివంతమైంది. దీని ప్రభావం ఎక్కువగా ఉరకామి లోయల పర్వాతాల వైపు వ్యాపించడం వాళ్ళ హిరోషిమాతో పోలిస్తే కొంత తక్కువ ప్రాణ నష్టం జరిగింది. అయినా 39వేలమంది పైచిలుకు ప్రాణాలు పైగా 25 వేలకు పైగా గాయపడ్డారు.

  జపానుపై అమెరికా సైన్యం మరో నాలుగు అణు బాంబుల దాడులకు సన్నాహాలు..

  అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. జపానుపై అమెరికా సైన్యం మరో నాలుగు అణు బాంబుల దాడులకు సన్నాహాలు చేసినట్టు తెలుస్తున్నది. మూడవ దాడికి ఆగస్టు 19వ తేదిని ఖరారు కూడా చేసింది. మిగతా దాడులు సెప్టెంబర్‌ మాసంలో చేయడానికి నిర్ణయించుకుని ఉండింది. కాని తరువాతి రోజులలో మరిన్ని అణుబాంబు దాడుల ప్రణాళిక ఉపసంహరించుకోవడంతో జపానులో అణు బాంబుల ఘోర కలి అంతటితో ఆగింది.

  రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాయే ప్రపంచ సైనికశక్తి ..

  ఇప్పుడు లభ్యమౌతున్న హిరోషిమా, నాగసాకి ఆటంబాంబు ఘటనల సమాచారం ప్రకారం అణుబాంబు ప్రయోగం బలంగా ముందుకు వస్తున్న సోవియట్‌ యూనియనుకు తన నూతన అణు బాంబుల శక్తిని నిరూపించి కట్టడి చేయడం, ప్రచ్ఛన్నయుద్ధం వైపు దానిని ఉసిగొల్పడం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాయే ప్రపంచ సైనికశక్తి అని చాటి చెప్పడం, తద్వారా ప్రపంచ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, తన రాజకీయ, ఆర్ధిక ఇతరత్రా ఆసక్తులను కాపాడు కోవడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write The Real Reason America Used Nuclear Weapons Against Japan. It Was Not To End the War Or Save Lives.
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more