స్మార్ట్‌ఫోన్ మీకు అలవాటా లేదా వ్యసనమా.. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి..?
మీకున్న వ్యసనాల్లో ఒకటి చెప్పండి అని అడిగితే ఎక్కువ మంది చెప్పే సమాధానాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం (Smartphone Usage) కచ్చితంగా ఉంటుంది. గతంలో ఖాళీ సమయం దొరికిందంటే ఆటలో, ఫ్రెండ్స్‌తో కాలక్షేపమో, సినిమాలో లేదా అలా నచ్చిన ప్రాంతాలకి వెళ్లి తిరిగి వచ్చేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో చాలానే మార్పులు వచ్చాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపేస్తున్నారు.
టెక్నాలజీ పరంగా ఓకే కానీ.. :
సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రీల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు అంటూ టైమంతా స్మార్ట్‌ఫోన్‌కే కేటాయిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టినా, ఏం పనిచేస్తున్నా దృష్టి అంతా ఫోన్ పైనే ఉంటుంది. ఫలితంగా టెక్నాలజీ సుపరిచితులుగా మారుతున్నా.. అప్‌డేట్‌గా ఉంటున్నా... ఇతర సమస్యలు మాత్రం కొత్తగా తలెత్తుతున్నాయి.

ఎన్నో ఆరోగ్య సమస్యలు :
స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎంత వరకు వచ్చిందంటే.. ఎక్కువ సమయం వినియోగం వల్ల కళ్లపై ప్రభావం పడుతోంది. ఫలితంగా దృష్టిలోపాలు పెరుగుతున్నాయి. దీంతోపాటు సమయానికి ఆహారం, నిద్ర లేకపోవడం కారణంగా రోజువారీ పనులపై సరిగ్గా దృష్టిసారించలేకపోతున్నారు.
సరైన ఫ్రేమ్ వర్క్ లేకుంటే :
కొంత మంది స్మార్ట్‌ఫోన్ అలవాటుగా ఉంటే.. మరికొందరికి వ్యసనంగా మారిపోతోంది. అయితే చాలా మంది దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంటారు. సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ప్రయత్నం చేసి విఫలం అవుతుంటారు. స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలని నిజంగా ఉంటే ఈ కింద తెలిపిన చిట్కాలను పాటించండి.
స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా అవసరం లేని నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయాలి. లేదంటే కొన్ని సమయాల్లోనే నోటిఫికేషన్‌లు వచ్చేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలి. సోషల్‌మీడియా సహా ఇతర యాప్స్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసుకోవాలి.
స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం చాలా మంది ఎక్కువ సమయం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అందువల్ల అవసరం లేని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. అవసరం ఉంటే అప్పటికప్పుడు లాగిన్ చేసి వినియోగించుకోవాలి. లేదా కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా లాగిన్ చేయాలి.
మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ దగ్గర పెట్టుకోవద్దు. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా.. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ఆన్ అయినా.. మీరు చేస్తున్న పనికి అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్ కాస్త దూరంగా పెట్టడం కారణంగా.. స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
కొంత మంది రాత్రి వేళల్లో స్మార్ట్‌ఫోన్‌ను పక్కనే పెట్టుకొని పడే కొనే అలవాటును కలిగి ఉంటారు. స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ కారణంగా నిద్రకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సడన్ రాత్రి మెలకువ వచ్చినా.. ఫోన్ పక్కన పెట్టుకోవడం కారణంగా వినియోగించే అవకాశం ఉంటుంది.
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ వినియోగానికి ప్రత్యేకమైన టైం కేటాయించుకోవడం ఉత్తమం. దీని కారణంగా మిగిలిన సమయంలో ఇతర పనులు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు సోషల్ మీడియా వినియోగానికి కూడా సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి దూరంగా ఉండొచ్చు.
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ వినియోగించే సమయాల్లో డిస్‌ప్లే బ్రైట్‌నెస్ సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. మరియు స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా మెరుగైన పనితీరును పొందవచ్చు. దీంతోపాటు రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వదిలేసే అలవాటును నియంత్రించుకోవాలి.
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అవసరమే అయినా.. హాని చేసేంత స్థాయిలో వినియోగం మంచిది కాదు. స్మార్ట్‌ఫోన్ అలవాటు మంచిదే అయినా.. స్మార్ట్‌ఫోన్ వ్యసనం ప్రమాదకరం. ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ద్వారా కాలింగ్, బ్రౌజింగ్, బ్యాంకింగ్ వంటి అనేక పనులను ఇంటి నుంచి సులభంగా నిర్వహించుకుంటున్నాం. ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అతిగా ఉపయోగిస్తే అంతే స్థాయిలో చేటు చేస్తుంది. ఏదేమైనా కచ్చితమైన సమయాలు పెట్టుకొని వినియోగించుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








