ఒకప్పటి 'కింగ్' వన్‌ప్లస్.. ఇప్పుడు ఇండియాలో జీరో.. గ్రీన్ లైన్ సమస్యే వన్‌ప్లస్ కొంప ముంచేసిందా?
OnePlus: ఒకప్పుడు వన్‌ప్లస్ అంటే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ బ్రాండ్. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో శామ్‌సంగ్, యాపిల్ లాంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్లతో మొదలుపెట్టి స్మార్ట్ టీవీలు, వేరబుల్స్, యాక్సెసరీస్ అంటూ దూసుకెళ్లింది. కానీ ఇప్పుడు వన్‌ప్లస్ మార్కెట్ షేర్ ఒక్కసారిగా పడిపోయింది. IDC ఇండియా రిపోర్ట్ ప్రకారం 2023లో 6.1% ఉన్న మార్కెట్ షేర్, 2024లో 3.9%కి పడిపోయింది.
కెనాలిస్ (Canalys) అనే మరో సంస్థ మరో షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2023 మొదట్లో 21% ఉన్న మార్కెట్ షేర్, 2024కి వచ్చేసరికి 6 శాతానికి పడిపోయిందని తేల్చేసింది. ఇదిలా ఉంటే, ఐకూ, మోటరోలా లాంటి బ్రాండ్లు మాత్రం దూసుకుపోతున్నాయి. వన్‌ప్లస్ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

* పోటీతత్వం
తక్కువ ధరకే పవర్ఫుల్ ఫోన్లు, స్మూత్ ఆపరేటింగ్ సిస్టమ్ (OxygenOS)తో వన్‌ప్లస్ యూజర్ల మనసు దోచుకుంది. కానీ సమయం మారుతున్న కొద్దీ వన్‌ప్లస్ స్ట్రాటజీ కూడా మారింది. మొదట్లో శామ్‌సంగ్‌కు పోటీగా ప్రీమియమ్ ఫోన్లతో దుమ్మురేపింది. ఆ తర్వాత అమ్మకాలు పెంచుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను కూడా మార్కెట్లోకి వదిలింది.
షియోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో లాంటి బ్రాండ్లతో వన్‌ప్లస్ పోటీ పడాల్సి వచ్చింది. ఆయా కంపెనీల ఫోన్లకు పోటీ ఇచ్చే ఫోన్లను ఇది రిలీజ్ చేసింది. ఈ స్ట్రాటజీతో వన్‌ప్లస్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని అయిందని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఒకప్పుడు యంగ్ టెక్ లవర్స్‌కి డ్రీమ్ బ్రాండ్‌గా ఉన్న వన్‌ప్లస్ క్రేజ్ తగ్గిపోయిందని టెక్ అనలిస్ట్ ఫైజల్ కావూసా అభిప్రాయపడ్డారు.
వన్‌ప్లస్ పడిపోవడానికి క్వాలిటీ కూడా ఒక కారణం. వన్‌ప్లస్ 7 సిరీస్ తర్వాత ఫోన్ల పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందని ఫైజల్ కావూసా అంటున్నారు. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 13 మోడల్స్ కాస్త బెటర్ అనిపించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన చెబుతున్నారు.
* గ్రీన్ లైన్ సమస్య, షాపుల వాళ్ల తిరుగుబాటు..
వన్‌ప్లస్‌కి పెద్ద దెబ్బ తగిలేలా చేసింది డిస్‌ప్లే సమస్య. చాలా ఫోన్లలో గ్రీన్ లైన్ వచ్చేసింది. సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వెల్లువెత్తాయి. కస్టమర్లు విసిగిపోయారు. రిటైలర్లు రిటర్న్స్, వారంటీ క్లెయిమ్స్‌తో తలలు పట్టుకున్నారు. ప్రాఫిట్ మార్జిన్స్ లేకపోవడం, కంపెనీ సపోర్ట్ సరిగా లేకపోవడం, వారంటీ ప్రాసెసింగ్ లేట్ అవ్వడంతో షాపుల వాళ్లు వన్‌ప్లస్‌పై తిరగబడ్డారు.
2024, మేలో ఏకంగా 4,500 రిటైలర్లు వన్‌ప్లస్ ఫోన్లను అమ్మడం బంద్ చేశారు. రిటైల్ షాపుల్లో ఇష్యూస్ రావడంతో వన్‌ప్లస్‌కి భారీ నష్టం జరిగింది. ఆన్‌లైన్‌లో, ముఖ్యంగా అమెజాన్‌లో వన్‌ప్లస్ బాగా పాపులర్ అయింది. కానీ ఆఫ్‌లైన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనే ప్లాన్ బెడిసి కొట్టింది. ఇది వన్‌ప్లస్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత దెబ్బతీసింది.
* నార్డ్ సిరీస్... ప్లస్సా? మైనస్సా?
తక్కువ ధరలో ఫోన్లు అమ్మడం కోసం వన్‌ప్లస్ తీసుకొచ్చిన నార్డ్ సిరీస్ సేల్స్ పెంచడానికి హెల్ప్ చేసింది. కానీ ఇది బ్రాండ్ వాల్యూని తగ్గించేసింది. పైగా 20 వేల నుంచి 30 వేల రూపాయల సెగ్మెంట్‌లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. యాపిల్ కూడా ఐఫోన్ల ధరలు తగ్గించి, ఈజీ EMI ఆప్షన్లు, ఫెస్టివల్ ఆఫర్లతో రెచ్చిపోయింది.
ఒకప్పుడు వన్‌ప్లస్ కొనేవాళ్లు కూడా ఇప్పుడు ఐఫోన్ల వైపు చూస్తున్నారు. నార్డ్ సిరీస్‌కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మాత్రం వెనకబడిపోయాయి. 2024లో శామ్‌సంగ్, వివో, ఐకూ, ఒప్పో కూడా వన్‌ప్లస్ మార్కెట్ షేర్‌ను లాగేసుకున్నాయి. ఒకప్పుడు వన్‌ప్లస్ మొబైల్స్ వస్తున్నాయంటే ప్రజలు విపరీతంగా బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
* ఆక్సిజన్ OS పంచాయితీ
ఆక్సిజన్ ఓఎస్‌ని ఒప్పో కలర్ఓఎస్‌తో కలపడం వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కి బాగా కోపం తెప్పించింది. చాలామంది వన్‌ప్లస్‌ను ఇష్టపడటానికి కారణం ఆ ఆపరేటింగ్ సిస్టమే. రెండింటినీ కలిపేయడంతో వన్‌ప్లస్ ప్రత్యేకత ఏముందని యూజర్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. కలర్ఓఎస్ ఇప్పుడు బాగానే ఉందని కొంతమంది టెక్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నా, చాలామంది యూజర్లు మాత్రం ఇంకా నమ్మట్లేదు.
* వన్‌ప్లస్ మళ్లీ పుంజుకుంటుందా..
కష్టాల్లో ఉన్నా వన్‌ప్లస్‌కి ఇంకా మిడ్-ప్రీమియమ్ ఆండ్రాయిడ్ మార్కెట్‌లో ఛాన్స్ ఉంది. సాఫ్ట్‌వేర్ సమస్యలు సరిచేసుకుని, క్వాలిటీ పెంచి, కస్టమర్ల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకుంటే వన్‌ప్లస్ మళ్లీ ట్రాక్‌లోకి రావచ్చు. కానీ పోటీ మాత్రం గట్టిగా ఉంది. పాత రోజులు మళ్లీ రావాలంటే వన్‌ప్లస్ చాలా కష్టపడాలి.


Click it and Unblock the Notifications