నాడు అమెరికా.. నేడు ట్విట్టర్.. వణుకుపుట్టిస్తున్న స్నోడెన్

Posted By:

అమెరికాకు చెందిన రహస్యాలను బయటి ప్రపంచానికి వెల్లడించి ఆ దేశానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన విజిల్ బ్లోయెర్ ఎడ్వర్డ్ స్నోడెన్ సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోకి ప్రవేశించారు. ఆయనకు నెటిజన్ల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆయనను ఫాలో అవుతామని వస్తున్న వారితో ట్విట్టర్ సైతం వణికాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎడ్వర్డ్ కెన్ యూ హియర్ మి అంటూ తొలి ట్వీట్ ను పెట్టగా 45 నిమిషాల్లో ఆయనను పాలో అయిన వారి సంఖ్య లక్షను దాటింది.ఒక్క రోజులో ఆయన వెనుక నడుస్తామని వచ్చిన వారి సంఖ్య 7.79 లక్షలకు చేరింది.

Read more: ఏలియన్స్ పై స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు

అంటే నిమిషానికి 3 వేల మందికి పైగా కొత్త ట్విట్టర్ ఖాతాదారులు ఆయనకు ఫాలోవర్లుగా మారుతున్నారు. మరో 4 రోజుల్లో ఈ సంఖ్య 50 లక్షలకు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన ట్విట్టర్ ద్వారా ఎవరిపై విరుచుకు పడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అమెరికాకు బ్రిటన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎడ్వర్డ్ మళ్లీ ఏ సునామిని తీసుకొస్తాడోనంటూ అగ్ర దేశాలు భయంతో చస్తున్నాయి.ఈ సందర్భంలో ఎడ్వర్డ్ అంటే ఎవరు..అసలేం చేశారు..అమెరికా సాగించిన గూఢచర్యం ఏమిటీ... అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:చైనాకు చుక్కలు చూపిస్తున్న ఇండియా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎడ్వర్డ్‌ స్నోడెన్‌

ఎడ్వర్డ్‌ స్నోడెన్‌.. ప్రపంచంలోని అతిశక్తివంతమైన దేశం అమెరికా చీకటి బాగోతాలను అత్యంత సాహసవంతంగా, ప్రభావవంతంగా సాక్ష్యాధారాలతో బయటపెట్టి ఘనుడు.అమెరికాకు చెందిన నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ)కు కాంట్రాక్టు పద్ధతిలో ఓ ఉద్యోగి. తన పనిలో భాగంగా చూపిన నిజాలకు అగ్రరాజ్యాన్ని గడగడలాడించాయి.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం

గూగుల్‌, యాహూ, వెరిజాన్‌ వంటి భారీ సంస్థల సహకారంతో అమెరికా ప్రభుత్వం ప్రపంచ పౌరుల ఫోన్‌ సంభాషనలు, మెయిల్స్‌, వీడియోస్‌ ఛాటింగ్‌, క్రెడిట్‌ కార్డు రికార్డులపై చట్ట విరుద్ధంగా నిఘా పెట్టి, వాటిని రికార్డు చేస్తున్నట్లు తెలిసింది. వీటన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా స్నోడెన్‌ వికిలీక్స్‌, గార్డియన్‌ దినపత్రికకు అందించాడు. వాటి ప్రచురణతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం వెలుగులోకొచ్చింది. స్నోడెన్‌ అమెరికా వదిలి ఇతర దేశాలలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అవినీతిపరుల జాబితాలో చేర్చి విచారణ

దేశ రహస్యాలను అన్యదేశాలకు అందించిన విషయంలో అతడ్ని అమెరికా ప్రభుత్వం అవినీతిపరుల జాబితాలో చేర్చి విచారణ చేపట్టింది. తన రహస్యాలను ప్రపంచానికి వెల్లడి చేసిన ఈ వ్యక్తి దొరికితే అమెరికా ఏంచేయనుందో అందరికీ తెలిసిందే. దేశ ద్రోహం కింద మరణశిక్ష వేయడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి.

రక్షణకై 21 దేశాలకు ఆసీలం కోసం దరఖాస్తు

దేశ భద్రతకు సంబంధించిన పలు కీలకమైన పత్రాలను గ్లెన్‌ గ్రీన్‌వాల్ట్‌, లారా పోయిట్రస్‌ అనే జర్నలిస్ట్‌లకు అతను అందించాడు. మే 2013లో అమెరికాను వదిలి హాంకాంగ్‌ వెళ్లాడు. దేశ రహస్యాలను బహిర్గతం చేసినందుకు అతడ్ని దోషిగా తేల్చి అమెరికా గూఢచర్యం చట్టం, 1917 ప్రకారం 30 ఏళ్లు కారాగారం అనుభవించాలని ఆ దేశ ప్రభుత్వం జూన్‌ 2014న ఆదేశాలు జారీ చేసింది. అతను రక్షణకై 21 దేశాలకు ఆసీలం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

స్నోడెన్‌కు ఆశ్రయ వీసా

దీంతో స్పందించిన రష్యా అతనికి ఒక సంవత్సరం గడువుతో కూడిన ఆసీలం కల్పించింది. అనంతరం మూడు సంవత్సరాల పాటు రష్యాలో ఉండేందుకు వీలుగా స్నోడెన్‌కు ఆశ్రయ వీసా లభించింది. అమెరికా జాతీయుడు ఎడ్వర్డ్‌ స్నోడన్‌ రష్యాను వీడి స్వదేశానికి తిరిగి రావాలని ఐరోపా పార్లమెంట్‌ సభ్యులు కోరారు. అంతేగాక అతనికి ప్రజా ప్రయోజనానికి సంబంధించిన రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు.

అమెరికా దాన్ని దాచాలని చూస్తోంది

హాంగ్ కాంగ్ లోని రహస్య ప్రదేశం నుండి కొంతమంది సన్నిహితులతో అప్పట్లో ఆన్ లైన్ లో చర్చలు జరిపారు. తన ఆన్ లైన్లో ప్రపంచ పౌరుల ఏకాంతానికి భంగం కలిగిస్తున్న అమెరికా దాన్ని దాచాలని చూస్తోంది అయిన అది దాగని నిజం. దీన్ని బయటపెట్టినందుకు అమెరికా ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టిన సరే, నన్ను చంపినా సరే, నిప్పులాంటి నిజాలను ఆపడం ఎవరి తరం కాదని' అన్నాడు.

తానూ ఏమైపోయినా పరవాలేదు

అలాగే తను చైనా గూఢచారిని అని అమెరికా చెప్పడం నిజంగా హాస్యాస్పదమన్నారు. ఇలా సమాచారాన్ని సేకరించి ఇప్పటివరకు ఎన్ని ఉగ్రవాదుల దాడులను ఆపారో చెప్పాలన్నారు. ఈ సాకుతో వ్యక్తుల స్వేచ్చకు భంగం కలిగించడం ఎంతవరుకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తానూ ఏమైపోయినా పరవాలేదు నిజాలను మాత్రం వెల్లడించే తీరుతానని ఎడ్వర్డ్ స్నో డెన్ స్పష్టం చేశారు.

'ప్రిజమ్‌' పేరిట చేపట్టిన అత్యంత రహస్య కార్యక్రమం

అసలు ఉగ్రవాద దాడులను నివారించే పేరుతో అమెరికా చేస్తున్న పని ఇదే. 'ప్రిజమ్‌' పేరిట చేపట్టిన అత్యంత రహస్య కార్యక్రమం ద్వారా.. అమెరికన్లు, ఇతర దేశస్థులు ఇంటర్నెట్‌ ద్వారా సాగించే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లను సేకరించి పరిశీలిస్తోంది. కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ గూఢచర్యాన్ని.. ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ బయటపెట్టాడు.

పౌరుల ఏకాంతానికి భంగం

ఇది అమెరికాతోపాటు మిగతా దేశాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. దీనివల్ల పౌరుల ఏకాంతానికి భంగం కలిగిస్తున్నట్లు హక్కుల సంస్థలు ఆరోపించాయి. దేశ భద్రత కోసం, చట్ట ప్రకారమే ఇది చేశామని బరాక్‌ ఒబామా ప్రభుత్వం అప్పుడు సమర్థించుకుంది. సైబర్‌ దాడుల ద్వారా ఆయుధ సమాచారాన్ని సేకరిస్తోందని చైనాపై గుడ్లురిమిన అమెరికానే ఇలా చేయడంతో.. అగ్రరాజ్యం కూడా తక్కువేం తినలేదని అప్పట్లో అన్ని దేశాలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి.

తొమ్మిది ఇంటర్నెట్‌ కంపెనీల నుంచి డేటా

మొత్తంగా తొమ్మిది ఇంటర్నెట్‌ కంపెనీల నుంచి డేటాను ఎన్‌ఎస్‌ఏ తీసుకున్నట్లు స్నోడెన్‌ పత్రాల్లో వెల్లడైంది. వినియోగదారుల ఏకాంతాన్ని పరిరక్షించడమే తన ప్రాధాన్యంగా చెప్పుకునే మైక్రోసాఫ్ట్‌ అందరికన్నా ముందుగా 2007లో ఈ కార్యక్రమంలో చేరింది. ఆ తర్వాత యాహూ (2008), గూగుల్‌ (2009), ఫేస్‌బుక్‌ (2009), పాల్‌టాక్‌ (2009), యూట్యూబ్‌ (2010), ఏఓఎల్‌ (2011), స్కైప్‌ (2011), ఆపిల్‌ (2012) చేరాయని ఎడ్వర్డ్ తన రహస్య పత్రాల్లో బయటపెట్టారు.

చైనా మొబైల్‌ కంపెనీలను హాక్‌

చైనాలోని అత్యున్నత విద్యా పరిశోధన సంస్థ జిన్హువా విశ్వ విద్యాలయంలోని పరిశోధనా సమాచారమంతటిని సిఐఏ హ్యాక్‌ చేస్తోందని ఆయన మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్‌ సమాచార చౌర్యంలో అమెరికాను అతిపెద్ద విలన్‌ గా అభివర్ణిస్తూ, చైనా మొబైల్‌ కంపెనీలను హాక్‌ చేయడం ద్వారా లక్షల కొద్దీ మెసెజ్‌లను అమెరికా సేకరించిందని స్నోడెన్‌ మార్నిగ్‌ పోస్ట్‌ పత్రికకు వెల్లడించాడు.

హద్దులులేని సమాచారం

హద్దులులేని సమాచారం అన్న కార్యక్రమం తో అమెరికా జాతీయ భద్రతా సంస్థ 2013 మార్చ్‌ నెలలోనే 9700 కోట్ల సమాచార అంశాలను ప్రపంచమంతటి నుండీ సేకరించింది. దీనిలో 300 కోట్లు అమెరికా ప్రజల నుండి రహస్యంగా సేకరించగా, ఇరాన్‌ నుండి 1400 కోట్లు, పాకిస్థాన్‌ నుండి 1350 కోట్లు, జోర్డాన్‌ నుండి 1270 కోట్లు, ఈజిప్టు నుండి 760 కోట్లు, భారత్‌ నుండి 630 కోట్లు యూరపు దేశాల నుండి 300కోట్లు రహస్యంగా సేకరించింది.

ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లలో ఎక్కువ భాగం అమెరికా గుండానే

అయితే ప్రపంచంలోని ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లలో ఎక్కువ భాగం అమెరికా గుండానే వెళతాయి. భౌతికంగా నేరుగా ఉండే మార్గం కన్నా.. తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం గుండానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లను పంపుతుంటారు. ప్రపంచంలోని ఇంటర్నెట్‌ మౌలిక వసతుల్లో అధిక భాగం అమెరికాలోనే ఉన్నాయి. అందువల్ల విదేశీ కమ్యూనికేషన్లను మధ్యలో అడ్డగించి సేకరించడానికి అమెరికా నిఘా సంస్థలకు అవకాశాలు పుష్కలంగా ఏర్పడుతున్నాయి.

జాతీయ భద్రతలో భాగంగా..

అప్పట్లో ప్రిజమ్‌ గురించి పత్రికల్లో కథనాలు రాగానే నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ క్లాపర్‌ స్పందించారు. జాతీయ భద్రతలో భాగంగా తాము ఆరేళ్లుగా గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ కంపెనీల ద్వారా అమెరికా వెలుపల ఉన్నవారికి సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు నిర్ధారించారు.

ఫిసా చట్టం ప్రకారమే దీన్ని చేస్తున్నాం

అమెరికా పౌరులు, అమెరికాలో ఉంటున్నవారిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించింది కాదని తెలిపారు. కోర్టు పర్యవేక్షణలో ఫిసా చట్టం ప్రకారమే దీన్ని చేస్తున్నామని సమర్థించుకున్నారు. ప్రిజమ్‌ కార్యకలాపాల గురించి కాంగ్రెస్‌కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా తన ప్రభుత్వ నిఘా కార్యక్రమాన్ని సమర్థించుకున్నారు.

సున్నా అసౌకర్యంతో మనం 100 శాతం భద్రతను పొందలేం

అది ఉగ్రవాద దాడులను నివారించడానికి చట్టబద్ధంగా చేపడుతున్నదేనని పేర్కొన్నారు. ''భద్రత సంబంధించిన అంశాలకు, ఏకాంతంపై ఆందోళనలకు సమతౌల్యం ఎలా చేసుకోవాలన్నదానిపై చర్చ జరగడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఆరోగ్యకరం. 100 శాతం ఏకాంతం, సున్నా అసౌకర్యంతో మనం 100 శాతం భద్రతను పొందలేం'' అని అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఏమిటీ ప్రిజమ్‌?

'ప్రిజమ్‌' అనేది అమెరికాలోని జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) చేపట్టిన అత్యంత రహస్య ఎలక్ట్రానిక్‌ నిఘా కార్యక్రమం. అధికారికంగా దీన్ని 'యూఎస్‌-984ఎక్స్‌ఎన్‌' అని పేర్కొంటారు. దీని కింద నెట్‌ ద్వారా సాగే లైవ్‌ కమ్యూనికేషన్లు, నిల్వ చేసిన సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తున్నారు. అమెరికా పౌరులు కాని, ఆ దేశం వెలుపల ఉండేవారిని కాని లక్ష్యంగా చేసుకొనేందుకు ఇది వీలు కల్పిస్తోంది. దీనికింద ఈ-మెయిల్‌, వీడియో, వాయిస్‌ చాట్‌, ఫొటోలు, వాయిస్‌ఓవర్‌ ఐపీ సంభాషణలు, ఫైల్‌ ట్రాన్స్‌ఫర్లు, లాగిన్‌ నోటిఫికేషన్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వివరాలను పొందడానికి వీలు కలుగుతుంది.

ప్రిజమ్‌ను 2007 డిసెంబర్‌లో ప్రారంభించారు.

ప్రిజమ్‌ను 2007 డిసెంబర్‌లో ప్రారంభించారు. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత జార్జి బుష్‌ సర్కారు తెచ్చిన 'ఉగ్రవాద నిరోధక కార్యక్రమం' స్థానంలో దీన్ని చేపట్టారు. ఉగ్రవాద నిరోధక కార్యక్రమంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాని చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తాయి. విదేశీ గూఢచర్య నిఘా కోర్టు(ఎఫ్‌ఐఎస్‌సీ) అనుమతి లేకుండా దీన్ని చేపట్టడమే ఇందుకు కారణం.

ప్రొటెక్ట్‌ అమెరికా యాక్ట్‌

ప్రిజమ్‌ను మాత్రం ఈ కోర్టు అనుమతించింది. 2007లో బుష్‌ ప్రవేశపెట్టిన 'ప్రొటెక్ట్‌ అమెరికా యాక్ట్‌', ఎఫ్‌ఐఎస్‌ఏ సవరణ చట్టం ప్రిజమ్‌ ప్రారంభానికి వీలు కల్పించాయి. దీనివల్ల నిఘా సంస్థలతో సహకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే కంపెనీలకు చట్టబద్ధమైన రక్షణ ఏర్పాట్లు ఉంటాయి.

2017 డిసెంబర్‌ వరకూ..

2012లో ఒబామా హయాంలో కాంగ్రెస్‌ దీన్ని ఐదేళ్ల పాటు అంటే.. 2017 డిసెంబర్‌ వరకూ పొడిగించింది. ఎఫ్‌ఐఎస్‌ఏ సవరణ చట్టం ప్రకారం- కమ్యూనికేషన్లు సాగిస్తున్న పార్టీల్లో ఒకరు అమెరికా వెలుపల ఉంటే, ఎలాంటి వారెంట్‌ లేకుండానే అమెరికా పౌరుల ఫోన్‌, ఈమెయిల్‌, ఇతర కమ్యూనికేషన్లను పర్యవేక్షించే అధికారం నిఘా సంస్థలకు ఉంటుంది.

ఎన్‌ఎస్‌ఏ చరిత్రలో ఇది పెద్ద లీకేజీ

అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ పథకాన్ని ఎన్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేశారు. ఎన్‌ఎస్‌ఏ చరిత్రలో ఇది పెద్ద లీకేజీ. అంతా గోప్యంగా ఉంచుతామని గొప్పలు చెప్పుకొనే ఆ సంస్థలో ఇది చోటుచేసుకోవడం గమనార్హం. స్నోడెన్‌ లీక్‌ చేసిన పత్రాల్లో 41 పవర్‌ పాయింట్‌ స్త్లెడ్‌లు ఉన్నాయి. సిబ్బందికి శిక్షణ కోసం వీటిని రూపొందించినట్లు భావిస్తున్నారు.

అమెరికా ఇప్పటికీ ఒత్తిడి

వీటిని లీక్‌ చేసిన స్నోడెన్‌.. అమెరికా ప్రాసిక్యూషన్‌, వేధింపుల భయంతో కొన్నాళ్లు హాంకాంగ్‌లో తలదాచుకుంటున్నారు. ఆయన్ను అప్పగించాల్సిందిగా అమెరికా ఇప్పటికీ ఒత్తిడి చేస్తోంది. అయితే ఆయనకు రష్యా అశ్రయం కల్పించింది. అమెరికాను దెబ్బతీయాలని చూస్తున్న రష్యా కు ఎడ్వర్డ్ రూపంలో మంచి ఆయుధం దొరికందని సంబరపడింది కూడా.

బ్రిటన్ పై మరో బాంబు

అగ్రరాజ్యం అమెరికా రహస్యాలను విప్పిచెప్పిన ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ అప్పట్లో బ్రిటన్ పై మరో బాంబును కూడా పేల్చారు. ఫాక్ లాండ్ దీవుల వ్యవహారంలో బ్రిటన్ అర్జెంటైనా సర్కారుపై గూఢచర్యానికి పాల్పడిందని తెలిపాడు. 2006 నుంచి 2011 వరకు బ్రిటీష్ గూఢచారులు ఎంతో చురుగ్గా కార్యకలాపాలు సాగించారని తెలిపాడు. ఫాక్ లాండ్ దీవుల కోసం 1982లో బ్రిటన్ అర్జెంటైనా మధ్య యుద్ధం జరిగిన విషయం విదితమే.

నోబెల్ బహుమతికి నామినేట్

అమెరికా సమాచారం మొత్తాన్ని దొంగతనంగా చోరి చేసి ప్రజలకు తెలియజేసి సంచలనం సృష్టించిన ఎడ్వర్డ్ స్నోడెన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. గత కొద్ది రోజులుగా ఆయన వివిధ దేశాలలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఎడ్వర్డ్ స్నోడెన్ ను నార్వే కు చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులు నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు.

మళ్లీ ఏ సునామిని తీసుకొస్తాడోనంటూ..

అయితే ఇప్పుడు ఆయన ట్విట్టర్ ద్వారా ఎవరిపై విరుచుకు పడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అమెరికాకు బ్రిటన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎడ్వర్డ్ మళ్లీ ఏ సునామిని తీసుకొస్తాడోనంటూ అగ్ర దేశాలు భయంతో చస్తున్నాయి.

నిమిషానికి 3 వేల మందికి పైగా..

ఎడ్వర్డ్ కెన్ యూ హియర్ మి అంటూ తొలి ట్వీట్ ను పెట్టగా 45 నిమిషాల్లో ఆయనను పాలో అయిన వారి సంఖ్య లక్షను దాటింది.ఒక్క రోజులో ఆయన వెనుక నడుస్తామని వచ్చిన వారి సంఖ్య 7.79 లక్షలకు చేరింది. అంటే నిమిషానికి 3 వేల మందికి పైగా కొత్త ట్విట్టర్ ఖాతాదారులు ఆయనకు ఫాలోవర్లుగా మారుతున్నారు. మరో 4 రోజుల్లో ఈ సంఖ్య 50 లక్షలకు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Edward Snowden joins Twitter, immediately gets more followers than NSA
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot