మోటో ఎడ్జ్ 60, ఐకూ Z10, Vivo X200, ఒప్పో Find X8.. ఏప్రిల్‌లో విడుదలయ్యే ఫోన్లు.. వాటి స్పెసిఫికేషన్లు ఇవే..
Upcoming Phones April: 2025, మార్చిలో రియల్‌మీ, నథింగ్ వంటి కంపెనీలు అదిరిపోయే కొత్త ఫోన్లను విడుదల చేశాయి. అయితే, ఏప్రిల్ నెల అంతకంటే ఎక్కువ జోష్‌తో ఉండబోతోంది. ఎన్నో మంచి స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. మోటరోలా నుంచి వివో, ఒప్పో వరకు పెద్ద పెద్ద కంపెనీలు తమ కొత్త మోడళ్లను పరిచయం చేయబోతున్నాయి. మరి ఏప్రిల్‌లో భారత్‌లో విడుదల కాబోతున్న ఆ ఫోన్ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
* మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ - ఏప్రిల్ 2న విడుదల
మోటరోలా ఏప్రిల్ 2న 'మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్' విడుదల చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో భారత్‌లో వస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.7 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ( నాలుగు వైపులా వంగి ఉంటుంది) అమోలెడ్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్‌తో వస్తోంది.

వచ్చేసిన శాంసంగ్ నియో క్యూలెడ్ 2025 సిరీస్.. NQ8 AI Gen3 పవర్‌తో 8K టీవీలు, NQ4 AIతో 4K మోడల్స్..!
దీని వెనుక మూడు కెమెరాలుంటాయి. 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, ఒక మాక్రో లెన్స్. 5500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. దీని ధర సుమారు రూ.25,000 ఉండొచ్చని అంచనా. మోటరోలా కొత్త ఫోన్ల కోసం చూస్తున్నవారు దీనికోసం వేచి చూడటం ఉత్తమం.
* ఐకూ Z10 5G - ఏప్రిల్ 11న విడుదల
ఏప్రిల్ 11న రాబోతున్న ఐకూ Z10 5G, ఒక సంచలన ఫీచర్‌తో వస్తోంది. అదే 7,300mAh భారీ బ్యాటరీ. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.
అలాగే స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. కెమెరాల విషయానికొస్తే, 50MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ లెన్స్ (వెనుక), 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది. దీని ధర కూడా సుమారు రూ.25,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ - ఏప్రిల్ 16న రావొచ్చు
MWC 2025 టెక్ ఈవెంట్‌లో ప్రదర్శించిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్, ఏప్రిల్ 16న భారతదేశంలో విడుదల కావచ్చని అంచనా. ఇందులో 6.6 అంగుళాల 2K అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 వంటి పటిష్టమైన రక్షణ ఉంటుంది. అత్యంత సన్నని ఫోన్ గా కూడా నిలబడి ఉంది.
ఇది శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. దీంతో గేమ్స్ ఆడటంతో పాటు వీడియో ఎడిటింగ్‌లు కూడా సులభంగా చేసుకోవచ్చు. వెనుక రెండు కెమెరాలుంటాయి. ఒకటి ఏకంగా 200MP మెయిన్ సెన్సార్, రెండోది 12MP అల్ట్రావైడ్ లెన్స్. ఈ ఫోన్‌లో 3900mAh బ్యాటరీ ఉంటుంది.
* వివో X200 అల్ట్రా - ఏప్రిల్‌లో రావొచ్చు
వివో తన X200 అల్ట్రా ఫోన్‌ను ఏప్రిల్‌లో ముందుగా చైనాలో, ఆ తర్వాత త్వరలోనే భారతదేశంలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇందులో 6.82 అంగుళాల 2K అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. కెమెరా విషయంలో ఇది అదరగొట్టేలా ఉంది.
200MP మెయిన్ లెన్స్, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, మరో 50MP జూమ్ లెన్స్ మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో, 6000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుందని సమాచారం.
* వివో X200s – చైనాలో ఏప్రిల్‌లో అంచనా
వివో మొబైల్ ప్రియులకు కూడా ఈనెల ప్రత్యేకంగా మారుతుంది. ఎందుకంటే X200 అల్ట్రాతో పాటు X200s మోడల్‌ను కూడా చైనాలో ఏప్రిల్‌లోనే విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇందులో 6.67 అంగుళాల LTPS అమోలెడ్ డిస్‌ప్లే, డిస్‌ప్లేలోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (అల్ట్రాసోనిక్) ఉంటాయని అంటున్నారు.
ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో పనిచేయవచ్చు. దీనికి వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. అవి 50MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 64MP టెలిఫోటో లెన్స్ అయి ఉండొచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం కూడా సుమారు 6000mAh ఉండే అవకాశం ఉంది.
* ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా – ఏప్రిల్ 10న చైనాలో విడుదల
ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'ఫైండ్ X8 అల్ట్రా'ను ఏప్రిల్ 10న చైనాలో విడుదల చేస్తోంది. భారతదేశానికి కొంచెం ఆలస్యంగా రావచ్చు. ఇందులో 6.82 అంగుళాల 2K అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. దీని కెమెరా సెటప్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుంది. 50MP 1-అంగుళాల సోనీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఇవ్వనున్నారు.
అలాగే మరో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేయనుంది. 6000mAh బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ దీని ఇతర ముఖ్యమైన విశేషాలు.


Click it and Unblock the Notifications








