మొబైల్ చార్జీలు పెరగనున్నాయా..?

Posted By: Staff

మొబైల్ చార్జీలు పెరగనున్నాయా..?

 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు టెలికాం లైసెన్సులను రద్దు చేయటంతో మొబైల్ చార్జీలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 122 లైసెన్సుల రద్దుతో టెలికాం రంగంలో పోటీ వాతావరణం తగ్గే అవకాశముండటంతో పాత టెలికాం ఆపరేటర్లు మార్జిన్లను పెంచుకోవటానికి టారిఫ్‌లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపరేటర్ల సంఖ్య తగ్గుతుండటంతో ప్రస్తుత ఆపరేటర్లు తమ స్థానాలను పటిష్ఠం చేసుకోవటానికి టారిఫ్‌లను పెంచే అవకాశముందని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. రద్దయిన లైసెన్సులను మరోసారి చేజిక్కించుకోవాలంటే స్పెక్ట్రమ్ లైసెన్సులను ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిందేనని దీంతో కొత్త కంపెనీలు టారిఫ్‌లను పెంచకతప్పదని పేర్కొంది. దీంతో ప్రస్తుతమున్న ఆపరేటర్లు కూడా కాల్ టారిఫ్‌లను పెంచవచ్చని క్రిసిల్ అంటోంది.

3జి, బిడబ్ల్యుఎ వేలం కోసం పెట్టిన పెట్టుబడులను రాబట్టుకోవటం కోసం ప్రస్తుత ఆపరేటర్లు టెలికాం టారిఫ్‌లను 20 శాతం వరకు పెంచవచ్చని భావిస్తున్నట్లు గార్ట్‌నర్ రీసెర్చ్ డైరెక్టర్ కమలేష్ భాటియా చెప్పారు. పోటీ వాతావరణం తగ్గే సూచనలు కన్పిస్తుండటంతో టెలికాం టారిఫ్‌లన్ని వాస్తవ వ్యయాలకు అనుగుణంగా క్రమబద్దీకరించే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే యూనినార్ అందిస్తున్న నిమిషానికి రెండు పైసల ఆఫర్ సహా కంపెనీ లైసెన్స్‌పై సుప్రీం తీర్పు ప్రభావం పడవచ్చని ఆయన తెలిపారు. తీర్పు కారణంగా ముంబైతో పోల్చితే ఇదే సర్వీసులకు ఢిల్లీలో 60 శాతం గరిష్ఠ టారిఫ్‌లను కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుందని యూనినార్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting