ప్రశ్నించి ఉద్యోగం సంపాదించాను: సుధా మూర్తి

Posted By: Staff

 ప్రశ్నించి ఉద్యోగం సంపాదించాను: సుధా మూర్తి

పొగతాగడం హానికరం అని బోర్డు పెట్టిన విధంగా.. 'మహిళలు దరఖాస్తు చేయరాదు' అంటూ ఓ ఉద్యోగానికి టెల్కో(టాటా) సంస్థ నిబంధన పెట్టడం నన్ను ఎంతో బాధించింది. అదే కోపంతో 15 పైసల పోస్టుకార్డుపై ఏకంగా జేఆర్‌డి టాటాకు ఉత్తరం రాశాను. అంత పెద్ద వ్యక్తికి రాసినప్పుడు కనీసం 20 పైసలు వెచ్చించి ఇన్‌లాండ్‌ కవరు పైన ఉత్తరం రాయాలేవా..? అంటూ మానాన్న నన్ను మందలించారు. కాని అదేమీ పట్టించుకోకుండా నేను పోస్ట్‌కార్డును పంపించాను. సరిగ్గా నాకు పది రోజులకు టాటా నుంచి సమాధానం వచ్చింది. అది నేను వూహించలేదు. తాను ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో రాసిన ప్రశ్నకు టాటా నుంచి జవాబు రావడంతోపాటు టాటా సంస్థలో ఓ మహిళకు మొట్టమొదటిసారిగా ఉద్యోగం ఇవ్వడం.. అదీ నేనే పొందడం నాకెంతో గర్వకారణంగా ఉంది'' అన్నారు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి.

మనం ఏ పనిచేసినా అందులో నిజాయితీ ఉండాలని అప్పుడే మనమంటే ఏంటో తెలుస్తుందన్నారు. అలాంటప్పడే విజయాలు సైతం వెతుక్కుంటూ వస్తాయని ఆమె అన్నారు. బంజారాహిల్స్‌లో శనివారం తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్‌ ఛాప్టర్‌కు అధ్యక్షురాలిగా నియమితులైన అపర్ణారెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధామూర్తి 'పవర్‌ ఆఫ్‌ విజన్‌ ఇన్‌ లీడర్‌ షిప్‌' అన్న అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను చేస్తున్న పని పట్ల చిత్తశుద్ధి, తనపై తనకు నమ్మకం ఉన్నప్పుడే మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా విజయాలు సాధిస్తారన్నారు. కర్ణాటక రాష్ట్రంలోనే తాను మొదటి మహిళా ఇంజినీర్‌నని చెబుతూ ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు సైతం తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె వివరించారు.

తాను బీటెక్‌లో చేరడానికి వెళ్లినప్పుడు సీటు ఇవ్వడానికి కళాశాల యాజమాన్యం నిరాకరించిందని.. అందుకు కారణం అడిగితే మహిళలకు సీటు ఇవ్వడం ద్వారా ఎన్నో ఇబ్బందులున్నాయని మహిళా టాయిలెట్‌ సైతం ఏర్పాటుచేయాల్సి వస్తుందంటూ సాకులు చూపారన్నారు. వీటన్నింటిని లెక్కచేయని తాను పట్టుదలతో ఇంజినీరింగ్‌ పూర్తిచేశానని తెలిపారు. చదువుకొనే కాలం నుంచే మహిళ అన్న పదాన్ని వాడుతూ ఇబ్బందులు పెట్టినప్పుడే వాటన్నింటిని అధిగమించానని ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ వరకు చేరుకున్నానని తెలిపారు. తరాలు మారుతున్న కొద్దీ మహిళల జీవితాల్లో సైతం మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి అనే సిద్ధాంతాన్ని తాను ఎప్పుడూ భోదిస్తుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ ఢిల్లీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు నీనా మల్హోత్రా, యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న చెరుకూరి, చందనా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot